అధికమాసం ముగియగానే కీలక ప్రకటన చెయ్యనున్న సీఎం కేసీఆర్!!
తెలంగాణ సీఎం కేసీఆర్ వచ్చే ఎన్నికలకు వ్యూహాలు రచిస్తున్నారా? ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు పూర్తి చేశారా? రానున్న తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న కేసీఆర్ అభ్యర్థుల ఎంపిక విషయంలో కీలక జాగ్రత్తలు తీసుకుంటున్నారా? విజయమే లక్ష్యంగా గెలుపు గుర్రాలను ఈసారి ఎన్నికల బరిలోకి దింపబోతున్నారా? అంటే అవును అనే సమాధానమే వస్తుంది.
ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలి అన్న ఆలోచనలో ఉన్న సీఎం కేసీఆర్ సర్వేలు, ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అధికమాసం కొనసాగుతున్న నేపథ్యంలో అధికమాసం ముగిసిన వెంటనే, నిజ శ్రావణమాసం సమయంలో చూసుకొని సీఎం కేసీఆర్ సింహభాగం స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనున్నట్టు సమాచారం.

ఆగస్టు మూడో వారంలో సీఎం కెసిఆర్ అత్యధిక స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనున్నట్లు తెలుస్తుంది. నియోజకవర్గాలలో ప్రజాదరణ లేని వారిని, కార్యకర్తలను, నాయకులను పట్టించుకోకుండా తీవ్ర వ్యతిరేకతను మూట కట్టుకున్న వారిని కెసిఆర్ పక్కన పెట్టనున్నట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం కాంప్లికేట్ గా ఉన్న స్థానాలకు కాకుండా ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా స్థానిక ఎమ్మెల్యేలకు విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్న స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.
బీఆర్ఎస్ పార్టీ మొత్తం 119 మంది అభ్యర్థులను ప్రకటించాల్సి ఉండగా.. మొత్తం మూడు విడతలుగా అభ్యర్థులను ప్రకటించాలని భావించినప్పటికీ, ప్రస్తుతం రెండు విడతల్లోనే అభ్యర్థుల జాబితాలను ప్రకటించాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఎక్కడైతే స్థానిక ఎమ్మెల్యేలకు చెక్ పెట్టి కొత్తవారికి అవకాశం ఇస్తారో అటువంటి నియోజకవర్గాలను ప్రకటించడానికి చివరి వరకు ఆగాలని భావిస్తున్నట్లుగా తెలుస్తుంది.
ఆగస్టు మూడో వారంలోనే అభ్యర్థులను ప్రకటిస్తే, ఎక్కడైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే వాటిని సర్దుబాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా ఆగస్టు నెలలో అధికమాసం ముగిసిన తర్వాత బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను వెల్లడించిన కేసీఆర్ ప్రత్యర్థి రాజకీయ పార్టీల కంటే ముందుగానే ఎన్నికల వ్యూహాలను అమలు చేస్తున్నారు. మరి కెసిఆర్ వ్యూహాలు వచ్చే ఎన్నికలలో ఏ మేరకు సత్ఫలితాలను ఇస్తాయో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications