సీఎం కేసీఆర్ రాజీనామాను ఆమోదించిన గవర్నర్: అప్పటి వరకు అపద్ధర్మ సీఎంగా
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి పదవికి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) రాజీనామా చేశారు. ఆదివారం వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీని కట్టబెట్టారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. ఈ నేపథ్యంలో కేసీఆర్ తన రాజీనామా లేఖను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు పంపారు.
ఈ క్రమంలో కేసీఆర్ రాజీనామాను గవర్నర్ ఆమోదించినట్లు రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. అయితే, కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు అపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని గవర్నర్ సూచించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కేసీఆర్ కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు అపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగనున్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 64 స్థానాల్లో విజయం సాధించి అధికారాన్ని కైవసం చేసుకుంది. ఈ క్రమంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే, ముఖ్యమంత్రి ఎవరనేది ఉత్కంఠగా మారింది. అయితే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 స్థానాల్లో విజయం సాధించగా.. బీఆర్ఎస్ పార్టీ 39 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ 8 స్థానాలకే పరిమితమైంది. ఎంఐఎం పార్టీ స్థానాల్లో గెలుపొందింది.
మరోవైపు, కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రావడంతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన కేసీఆర్.. నేరుగా తన ఫాంహౌస్‌కు బయల్దేరారు. ఎలాంటి కాన్వాయ్ లేకుండానే ఆయన వెళ్లిపోయారు. ఎన్నికల ఫలితాలతో ఆయన కొంత కలత చెందినట్లు తెలుస్తోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పుతాయని.. బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి వస్తుందనే నమ్మకం వ్యక్తం చేసినప్పటికీ.. అసలైన ఫలితాలు కూడా ఎగ్జిట్ పోల్స్ ను అనుసరించడంతో బీఆర్ఎస్ శ్రేణులు కూడా నిరాశకు గురయ్యారు.












Click it and Unblock the Notifications