హైదరాబాద్‌లో లండన్ ఐ
Revanth Reddy: తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి సారథ్యాన్ని వహిస్తోన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. పెట్టుబడులపై దృష్టి సారించారు. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించే దిశగా చర్యలు తీసుకుంటోన్నారు. పెట్టుబడులను ఆకర్షించే క్రమంలో ఆయన దావోస్ పర్యటనలో పర్యటించారు.
స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ప్రతి సంవత్సరం ఏర్పాటయ్యే ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరయ్యారు. అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీ అధినేత గౌతమ్ అదాని, టాటా సన్స్ చీఫ్ ఎన్ చంద్రశేఖరన్ సహా పలువురు దిగ్గజ పారిశ్రామికవేత్తలతో సమావేశం అయ్యారాయన. 15,000 కోట్ల రూపాయల విలువ చేసే పెట్టుబడులకు సంబంధించిన అవగాహన ఒప్పందాలను కుదుర్చుకున్నారు.

దావోస్ పర్యటన ముగిసిన అనంతరం రేవంత్ రెడ్డి.. లండన్‌కు చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన లండన్‌లో పర్యటిస్తోన్నారు. ఈ పర్యటనలో ఆయన వెంట- ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి, సీనియర్ ఐఎఎస్ అధికారిణి ఆమ్రపాలి, దాన కిశోర్, సీఎం వ్యక్తిగత కార్యదర్శి, ఇతర అధికారులు ఉన్నారు.
తన పర్యటనలో భాగంగా థేమ్స్ నదిని సందర్శించారాయన. థేమ్స్ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులను కలుసుకున్నారు. వారితో సమావేశం అయ్యారు. అనంతరం థేమ్స్ నదీ తీరంలో కలియతిరిగారు. లండన్ బ్రిడ్జి, లండన్ ఐ, బిగ్ బెన్, టవర్ బ్రిడ్జ్‌ను తిలకించారు.

వాటిని నిర్మించడం వల్ల ప్రభుత్వనికి అందుతోన్న ఆదాయం, నిర్వహణ వ్యయం గురించి రేవంత్ రెడ్డి.. థేమ్స్ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దడంపై అందుతోన్న రోజువారీ రెవెన్యూ వివరాలను అధికారులు రేవంత్ రెడ్డి వివరించారు.
హైదరాబాద్‌లో లండన్ ఐ ఏర్పాటు, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రతిపాదనలను వారితో చర్చించారు. లండన్ ఐ ఏర్పాటుకు గల సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలంటూ సూచించారాయన. దీనివల్ల హైదరాబాద్ ఆదాయం మరింత పెరుగుతుందని రేవంత్ రెడ్డి అంచనావేశారు.












Click it and Unblock the Notifications