రేవంత్.. సమరశంఖం: చీకటి ఒప్పందంపై నోరు మెదపరేం?
Revanth Reddy: దేశాన్ని పట్టి కుదిపేస్తోన్న మణిపూర్ హింసాత్మక పరిస్థితులు, ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదాని వివాదాలపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సమర శంఖాన్ని పూరించింది. హైదరాబాద్‌లో భారీ నిరసన ప్రదర్శన చేపట్టింది. ఛలో రాజ్ భవన్ పేరుతో టీపీసీసీ చేపట్టిన ఈ ర్యాలీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ ర్యాలీకి నేతృత్వాన్ని వహించారు.
నెక్లెస్ రోడ్‌లోని ఇందిరా గాంధీ విగ్రహం నుంచి ఖైరతాబాద్ ఫ్లైఓవర్ మీదుగా రాజ్ భవన్ వరకు చేపట్టిన నిరసన ప్రదర్శన ఇది. రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహా పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇందులో పాల్గొన్నారు. ఈ ర్యాలీని పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు.

దీనితో రేవంత్ రెడ్డి రోడ్డుపైనే బైఠాయించారు. తన నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 75 సంవత్సరాల కాలంలో దేశ ప్రతిష్ఠను కాంగ్రెస్ పార్టీ ఇనుమడింపజేసిందని అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, గౌతమ్ అదానీ ఆర్థిక అవకతవకలకు పాల్పడి ప్రపంచం ముందు దేశ పరువు తీశారని ఆరోపించారు.
అమెరికాకు సంబంధించిన సంస్థలకు అదానీ లంచాలు ఇచ్చారంటూ ఆ దేశ విచారణ సంస్థలు సైతం నివేదికలు ఇచ్చాయని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. అయినప్పటికీ- పార్లమెంట్‌లో కనీసం చర్చకు కూడా అవకాశం ఇవ్వట్లేదంటూ కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. దేశ పరువు ప్రతిష్టను మంటగలిపిన అదానీపై విచారణ చేపట్టాలంటూ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లోక్‌సభలో డిమాండ్ చేశారని అన్నారు.
అయినప్పటికీ ప్రధాని మోదీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోన్నారని మండిపడ్డారు. అదాని అంశంపై మాట్లాడటానికి అధికార పక్షం ఎందుకు ముందుకు రావట్లేదని నిలదీశారు. అందుకే నేడు దేశ వ్యాప్తంగా రాజ్ భవన్ ముట్టడికి కాంగ్రెస్ పిలుపునిచ్చిందని రేవంత్ రెడ్డి వివరించారు.
ప్రభుత్వమే ధర్నాకు కూర్చోవడం కొందరికి నచ్చకపోవచ్చని, కొందరికి కడుపులో నొప్పి ఉండొచ్చని చురకలు అంటించారు రేవంత్ రెడ్డి. అదానీ అంశంపై కేసీఆర్, బీఆర్ఎస్.. తమ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తమ వైఖరి ఏమిటో చెప్పకుండా కాంగ్రెస్‌ను అవహేళన చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
బీజేపీతో బీఆరెస్ చీకటి ఒప్పందంలో భాగంగానే ఆదానీపై వారు నోరు మెదపట్లేదని రేవంత్ తేల్చి చెప్పారు. అరెస్టుల నుంచి తప్పించుకోవడానికి బీజేపీకి బీఆర్ఎస్ లొంగిపోయిందని ఆరోపించారు. అందుకే- ఆదానీపై గురించి మాట్లాడటానికి బీఆర్ఎస్ నేతలు ముందుకు రావట్లేదని అన్నారు.
పార్లమెంట్‌లోనూ బీఆర్ఎస్ తమ పార్టీ విధానం ఏమిటో చెప్పాలని, వాళ్లు ప్రజల వైపు ఉంటారా? లేక అదానీ వైపా? అనేది చెప్పాలని రేవంత్ రెడ్డి అన్నారు. ఆదానీపై మాట్లాడితే తమను ఎక్కడ జైలులో పెడతారోననే భయం బీఆర్ఎస్ నేతల్లో ఉందని రేవంత్ అన్నారు. బీఆర్ఎస్ నాయకులు తమను విమర్శించడం కాదని, ఆదానీపై, జేపీసీపై వైఖరేంటో చెప్పాలని, ఎంపీలతో లేఖ రాయించాలని చెప్పారు.
మోదీ, కేసీఆర్ వేర్వేరు కాదని, నాణేనికి బొమ్మ, బొరుసులాంటి వారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. జేపీసీపై డిమాండ్ చేస్తే శాసన సభలో తీర్మానం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దేశాన్ని దోచుకున్న ఆదానీపై జేపీసీ వేయడానికి ప్రధాని ఎందుకు సిద్ధంగా లేరని, అదానితో లాలూచీ ఏంది అంటూ నిప్పులు చెరిగారు.
జేపీసీ వేయకపోతే అవసరమైతే రాష్ట్రపతి భవన్ వద్ద కూడా ధర్నా చేయడానికి తామందరం సిద్ధంగా ఉన్నామని రేవంత్ రెడ్డి అన్నారు. తన స్నేహితుడిని కాపాడటానికి ప్రధాని మోదీ శతవిధాలా ప్రయత్నిస్తోన్నారని, అయినా అది సాధ్యం కాబోదని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications