ప్రజా పాలన విజయోత్సవ సంబరాల వెనుక సీఎం రేవంత్ వ్యూహం!
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, సీఎం గా రేవంత్ రెడ్డి పాలనా పగ్గాలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా సంవత్సర కాలంలో ప్రజా పాలనపై ప్రజల వద్దకు వెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇందులో భాగంగా ప్రజా పాలన ప్రజా విజయోత్సవం పేరుతో ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పాటు హైదరాబాద్లో కూడా భారీ ఎత్తున సంబరాలు నిర్వహించడానికి దిశానిర్దేశం చేశారు.
సంక్షేమ. అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలలోకి తీసుకెళ్ళే ప్లాన్
ప్రజా పాలన ప్రజా విజయోత్సవం పేరుతో నిర్వహించే సంబరాల పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో అధికారులు డిసెంబర్ 9వ తేదీ వరకు ప్రజా పాలన విజయోత్సవాలపై చేపట్టే కార్యక్రమాలను సీఎంకు వివరించారు. అయితే ఏడాది కాలంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ. అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలలోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.

ప్రజా పాలన విజయోత్సవంలో భాగంగా బహిరంగ సభల్లో సీఎం రేవంత్
మహిళా సాధికారత, రైతు సంక్షేమం, యువతకు ఉపాధి వంటి అనేక అంశాలలో ప్రభుత్వం చేసిన కృషిని ప్రజలలోకి తీసుకువెళ్లాలని రేవంత్ రెడ్డి సూచించారు. ఇవి ప్రజలకు తెలిసేలా వివిధ కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. ఇక ప్రజా పాలన విజయోత్సవంలో భాగంగా వరంగల్, కరీంనగర్, మహబూబ్నగర్ జిల్లాల్లో ఏర్పాటు చేసే బహిరంగ సభలలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సవాలు
ఈ నెల 19వ తేదీన వరంగల్ వేదికగా 22 జిల్లాలలో ఇందిరా మహిళా శక్తి భవనాలకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఇక మరోవైపు డిసెంబర్ 9వ తేదీన సెక్రటేరియట్ ఆవరణలో ప్రధాన గేటు ముందు ఏర్పాటుచేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ప్రజా పాలన విజయోత్సవ వేడుకలలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించారు.
మహిళలను ఆహ్వానించి తెలంగాణా తల్లి విగ్రహావిష్కరణ
డిసెంబర్ 7, 8, 9 వ తేదీలలో హైదరాబాద్ ట్యాంక్ బండ్, సెక్రటేరియట్, నెక్లెస్ రోడ్ పరిసరాలలో విజయోత్సవ వేడుకలు నిర్వహించాలని కూడా నిర్ణయించారు. ఇక సెక్రటేరియట్ ఆవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా మహిళలను ఆహ్వానించాలని కూడా నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా శాఖల వారీగా, విభాగాల వారీగా తొలి సంవత్సరం తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిన విజయాలను పట్టిన కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని రేవంత్ రెడ్డి సూచించారు.












Click it and Unblock the Notifications