అక్కడ చేసినట్టు ఇక్కడ చేస్తే లోపల వేయిస్తా.. అధికారికి సీఎం వార్నింగ్ !
హైదరాబాద్ లోని జలసౌధ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. అధికారులతో ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలోనే మహబూబ్‌నగర్ సీఈ రమణారెడ్డిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన భూ సేకరణ, పునరావాస సమస్యలు పూర్తవగానే పంపుహౌస్‌ల నిర్మాణం మొదలవుతుందని సీఎం వ్యాఖ్యానించారు. ఆ తర్వాతే పైపుల బిల్లులు వేయాలని సూచించారు. ఇంతకుముందు రమణారెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టులో ఎస్‌ఈగా పనిచేశారు. ఆ విషయాన్ని గుర్తుచేస్తూ.. అక్కడ చేసినట్లు ఇక్కడ చేస్తే, చర్యలు తప్పవని.. కేసు పెట్టి లోపల వేయిస్తానని సీఎం హెచ్చరించారు.
అంతే కాకుండా కాళేశ్వరం బ్యారేజీ విషయంలో.. విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కేసులు ఉన్న వారిపై తప్పకుండా చర్యలు ఉంటాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కేసులకు సంబంధం లేని వారు భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో ఒకటికి రెండుసార్లు తప్పులు లేకుండా సరి చూసుకోవాలన్నారు. గతంలో పొరపాట్లు చేసిన వారిపై విజిలెన్స్ కేసులవుతున్నాయన్న విషయాన్ని గుర్తు చేసుకుంటూ జాగ్రత్తగా పని చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు.

ఇక కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల గురించి అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. అవసరం ఉన్నంత వరకే కాంట్రాక్టు సిబ్బందిని తీసుకోవాలని సూచించారు. అందువలన ప్రభుత్వం ఒక కమిటీ వేసిందని ప్రతిపాదనలు వచ్చాక పరిశీలిస్తామని స్పష్టం చేశారు. ప్రాజెక్టుల ఓ అండ్ ఎం పెండింగ్ బిల్లులకు నెలకు రూ.50 కోట్లు, నిర్వహణకు రూ.75 కోట్ల వరకు కేటాయింపులు చేస్తామని సీఎం హామీ ఇచ్చినట్టు అధికారులు చెబుతున్నారు.
మరోవైపు నేడు ఇరిగేషన్ శాఖలో కొత్తగా నియమితులైన ఉద్యోగులకు నియామక పత్రాలను సీఎం స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా గత పదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఒక్క ఉద్యోగాన్ని కూడా నియమించలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం ఉద్యోగాలను కల్పిస్తుంటే, కొందరు కోర్టు వెళ్లి అడ్డుకుంటున్నారని ఆరోపించారు. గ్రూప్-1 నియామకాలను అడ్డుకున్న కుట్రదారులెవరో ప్రజలు తెలుసుకోవాలని వ్యాఖ్యానించారు. లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం 50 వేల ఎకరాలకు కూడా నీరు అందించలేకపోయిందని మండిపడ్డారు. ప్రాజెక్టుల పేరుతో వేల కోట్ల రూపాయలు ఎక్కడికి పోయాయో ప్రజలకు తెలియజెప్పాలన్నారు. అక్రమాలకు పాల్పడిన అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ నేత హరీష్ రావు స్పందిస్తూ.. విజిలెన్స్ నివేదికల ఆధారంగా అధికారులను ఉరితీయాలంటే అది ప్రజాస్వామ్యమా? రాచరికమా? అని ప్రశ్నించారు. SLBC టన్నెల్ పనులపై సీఎం చర్చకు సిద్ధమా? అని సవాలు విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఇప్పటివరకు ఎంత నీరు ఎక్కడికి ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications