అక్కడ కాంగ్రెస్ తో పొసగేనా.. కమ్యూనిస్టులు కలిసేనా!!
రాష్ట్రంలో ఎన్నికల తేదీలు వచ్చాయి కానీ.. కాంగ్రెస్, కమ్యూనిస్టుల పొత్తులు మాత్రం తేలడం లేదు. పొత్తుల్లో భాగంగా సీపిఐ సీపీఎం లకు చెరి రెండు సీట్లు ఇస్తామని కాంగ్రెస్ చెప్తుంటే మాకు అంతకు ఎక్కువే వస్తాయని వామపక్షాలు ధీమాగా ఉన్నాయి . కానీ వామపక్షాలు అడిగిన ప్రతి సీట్ వద్ద ఏదో ఒక అడ్డంకి ఏర్పడుతోంది.
ప్రధానంగా నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ, మునుగోడు సీపీఐ, సీపీఎం లు అడుగుతున్నాయి. మిర్యాలగూడలో సీపీఎం తరపున మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పోటీకి దిగాలని భావిస్తున్నారు. ఇక్కడ జూలకంటి రెండుసార్లు ఎమ్మెల్యే గా గెలవడం, అలాగే సిమెంట్, రైస్ ఇండస్ట్రీస్ ఎక్కువగా ఉండటంతో ఆ కార్మికుల ఓట్లు కలిసొస్తాయని సీపీఎం భావిస్తోంది.

కానీ అదే సమయంలో మిర్యాలగూడలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి తనయుడు తన రాజకీయ అరంగేట్రం చేస్తుండటం తో ఆస్థానాన్ని కాంగ్రెస్ వదులుకోవడానికి ఇష్టపడటం లేదు. గతంలో చాలా సార్లు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవడంతో పాటు ప్రత్యేక ఓటుబ్యాంకు కూడా కలిగి ఉండటం తమకు కలిసొస్తుందని అందుకే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నే బరిలోకి దిగాలని భావిస్తోంది.
ఇక జిల్లాలో సీపిఐ కి బాగా పట్టున్న మునుగోడు లో ఆ పార్టీ విచిత్ర పరిణామం ఎదుర్కొంటుంది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో సీపీఐ అధికార బిఆర్ఎస్ కు మద్దతు ఇస్తూ పోటీకి దూరంగా ఉంది. దీంతో బిఆర్ఎస్ కు మద్దతుగా దూరంగా ఉన్న మీరు మళ్లీ పొత్తుల్లో ఇక్కడ సీటు అడగటం ఏంటని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది.
ఊహించని ఈ పరిణామంతో ఉప ఎన్నికలలో పోటీకి దూరంగా ఉండి తప్పు చేశామా ఆని ఆ పార్టీ కార్యకర్తలు అభిప్రాయ పడుతున్నారు. ఇప్పటికే పొత్తుల పేరుతో బిఆర్ఎస్ తో భంగపడ్డ వామపక్షాలు ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది తేలాల్సి ఉంది. పొత్తుల కోసం గట్టిగా పట్టుబట్టాలా, లేక ఇచ్చిన స్థానాలతో సరిపెట్టుకోవాలా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది. ఒక వేళ పంతాలకు పోయి ఇక్కడా పొత్తు కుదరక పోతే వామపక్షాల పరిస్థితి ఏంటన్నది అంతు చిక్కడం లేదు.












Click it and Unblock the Notifications