హెచ్‌సీఏ ఉపాధ్యక్షుడు, జాయింట్ సెక్రటరీపై సీఐడీకి కంప్లైంట్..!
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ఉపాధ్యక్షుడు దల్జీత్ సింగ్, జాయింట్ సెక్రటరీ బసవరాజుపై మాజీ కోశాధికారి చిట్టి శ్రీధర్ సీఐడీకి, అంబుడ్స్‌మన్‌కి ఫిర్యాదు చేశారు. మల్టిపుల్ క్లబ్ ఓనర్‌షిప్ ప్రయోజనాలను ఉపయోగించుకుని ఈ ఇద్దరూ హెచ్‌సీఏ ఎన్నికల్లో గెలుపొందారని ఆరోపించారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 2022 వరకు బసవరాజు కమర్షియల్ ట్యాక్సెస్ క్రికెట్ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహించారు. ప్రభుత్వ ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తర్వాత, 2023లో దల్జీత్ సింగ్ కుటుంబానికి చెందిన అమీర్‌పేట్ క్రికెట్ క్లబ్ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం దల్జీత్ సింగ్ కుటుంబం ఆధ్వర్యంలో అమీర్‌పేట్ క్రికెట్ క్లబ్, ఖాల్సా క్రికెట్ క్లబ్‌లు నడుస్తున్నాయి.

గతంలో మల్టిపుల్ క్లబ్ ఓనర్‌షిప్ నిబంధనల ఉల్లంఘన కారణంగా 57 క్లబ్‌లపై జస్టిస్ లావు నాగేశ్వరరావు వేటు వేశారు. అదే నియమం ప్రకారం, దల్జీత్ సింగ్ కుటుంబానికి చెందిన క్లబ్‌లపైనా సస్పెన్షన్ విధించాలని చిట్టి శ్రీధర్ ఫిర్యాదులో కోరారు. ఈ రెండు క్లబ్‌ల నుంచి హెచ్‌సీఏ ఉపాధ్యక్షుడు, జాయింట్ సెక్రటరీ పదవులు దక్కించుకోవడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు.
అక్రమంగా ఎన్నికైన కార్యవర్గాన్ని రద్దు చేసి, తక్షణం కొత్త ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఫిర్యాదుపై హెచ్‌సీఏ అంబుడ్స్‌మన్‌కి అందిన వివరాల ఆధారంగా సీఐడీ అధికారులు చిట్టి శ్రీధర్‌ను సంప్రదించి మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు.












Click it and Unblock the Notifications