వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయను.. జగ్గారెడ్డి సంచలన నిర్ణయం !!
దసరా పండుగ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి సంచలన నిర్ణయం ప్రకటించడం అందరికీ షాక్ ఇచ్చింది. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని స్పష్టం చేయడంతో ఆయన అభిమానులతో పాటు, కాంగ్రెస్ నేతలు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే సంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తన భార్య నిర్మల బరిలోకి దిగుతారని తెలిపారు. దాంతో ఈ అనూహ్య నిర్ణయం వెనుక ఆంతర్యం ఏంటని రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది.
జగ్గారెడ్డి ఏమన్నారంటే..
ఓ కార్యక్రమంలో పాల్గొన్న జగ్గారెడ్డి మాట్లాడుతూ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయను. సంగారెడ్డి నియోజకవర్గం నుండి నా భార్య నిర్మల పోటీ చేస్తారని ఆయన స్పష్టం చేశారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా ప్రజలు గెలిపించినందుకు నియోజకవర్గ అభివృద్ధికి తాను చేయగలిగినదంతా చేశానని ఈ సందర్భంగా ప్రజలకు వివరించారు. అయితే శాశ్వతంగా రాజకీయాలకు దూరమవడం లేదని తేల్చి చెప్పారు. కేవలం పదేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయనని తెలిపారు.

ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్తానని అన్నారు. ప్రస్తుతం తన వయస్సు 59 ఏళ్లని.. మరో పదేళ్ల తర్వాత మళ్లీ రాజకీయాల్లోకి వస్తానని జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఈ పదేళ్ల వ్యవధిలో ఎవరు వస్తారో తెలియదని.. కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసిన వారికి అవకాశం ఇవ్వాలని ఆయన అన్నారు.
ఇక జగ్గారెడ్డి భార్య నిర్మల ప్రస్తుతం టీజీఐఐసీ ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గతంలో జగ్గారెడ్డి తరపున నియోజకవర్గ వ్యవహారాలను వారి కుమార్తె జయారెడ్డి చూసుకునేవారు. ఆమెకు గత ఆగస్టులో వివాహం కావడంతో, అప్పటి నుంచి నిర్మల నియోజకవర్గ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు. అయితే ఆయన నిర్ణయంపై కాంగ్రెస్ హైకమాండ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉండగా ఇప్పుడు ఈ ప్రకటన చేయడం ఏంటని పొలిటికల్ వర్గాల్లో డిస్కషన్ నడుస్తోంది. మరోవైపు దేశవ్యాప్తంగా రాజకీయాల్లో కొత్త పోకడలు చోటు చేసుకుంటున్నాయి. పలు పార్టీలు పాతతరం నాయకులను పక్కనపెట్టి కొత్తవారికి.. ముఖ్యంగా మహిళలకు అవకాశాలు కల్పిస్తున్నాయి. ఈ పరిణామాలను ముందే గ్రహించిన జగ్గారెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications