కేసీఆర్ రాజీనామా చెయ్యాలని కాంగ్రెస్ మహాధర్నా.. మంత్రి శ్రీధర్ బాబు తీవ్ర హెచ్చరిక
తెలంగాణా రాష్ట్రంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అసెంబ్లీ సమావేశాల వేళ అధికార కాంగ్రెస్ మహా ధర్నా చేయటం ఆసక్తిగా మారింది. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన ఎమ్మెల్యే పదవికి వెంటనే రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు.
కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు రాకపోవడంపై కాంగ్రెస్ ఆగ్రహం
ఎమ్మెల్యేగా నెలకు భారీగా జీతభత్యాలు పొందుతూ, ప్రజాధనాన్ని తీసుకుంటున్న కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు రాకపోవడంపై కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు కేసీఆర్ జీతంగా, ఆయన భద్రతకు కోట్లాది రూపాయలు ఖర్చు చేసినట్టు లెక్క చెప్పారు. మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, జగ్గారెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ఈ మహాధర్నాలో పాల్గొన్నారు.

విపక్షాల విష ప్రచారాలను తిప్పి కొట్టాలన్న మంత్రి శ్రీధర్ బాబు
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, బీఆర్ఎస్ నాయకులు రోడ్లపైనే కాకుండా అసెంబ్లీకి వచ్చి సమాధానం చెప్పాలని సవాలు విసిరారు. పదేళ్లు సీఎంగా పనిచేసిన కేసీఆర్ తన అనుభవాన్ని సభలో పంచుకోవాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం జవాబుదారీతనంతో పని చేస్తోందని, విపక్షాలు సోషల్ మీడియాలో చేస్తున్న విష ప్రచారాలను తిప్పికొట్టాలని పేర్కొన్నారు.
అప్పుల రాష్ట్రాన్ని అప్పగించినా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్న మంత్రి
వెయ్యి రోజుల పాలనలో తాము ఏం చేశామో అసెంబ్లీకి వస్తే వివరిస్తామన్నారు. పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, రెండున్నరేళ్లలోనే రైతుల ఖాతాల్లోకి రూ.1.60 లక్షల కోట్లు జమ చేశామని గుర్తు చేశారు. రూ.8 లక్షల కోట్ల అప్పుతో కూడిన రాష్ట్రాన్ని స్వీకరించి కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు.ఆర్టీసీ బస్సుల్లో కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రమే ప్రయాణం చేస్తున్నారా? చెప్పాలన్నారు.
మరో పదేళ్లు కూడా రోడ్ల మీదనే ఉంటారన్న మంత్రి శ్రీధర్ బాబు
బీఆర్ఎస్ పాలనలో గ్రేడ్-1 నియామకాలు జరగలేదని విమర్శించారు. బీఆర్ఎస్ నాయకుల వైఖరి మారకపోతే మరో పదేళ్లు కూడా రోడ్ల మీదనే ఉంటారు" అని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఆరు గ్యారంటీలను పూర్తి స్థాయిలో అమలు చేస్తామని, అందులో ఎలాంటి సందేహం లేదని మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు.













Click it and Unblock the Notifications