అల్లు అర్జున్ కు కాంగ్రెస్ ఎంపీ కౌంటర్..రీల్ హీరో కాదు..రియల్ హీరోలా ఉండు..!
హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద ఫుష్ప 2 సినిమా చూసేందుకు కుటుంబంతో వచ్చి తొక్కిసలాటకు కారణమయ్యారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న హీరో అల్లు అర్జున్ నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరోసారి వివరణ ఇచ్చారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఈ ఘటనపై చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ నేతల్ని మరింత మంటపుట్టించేలా ఉన్నాయి. దీనిపై భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఘాటుగా స్పందించారు.
అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పై స్పందించిన భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి.. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై హడావిడిగా ప్రెస్ మీట్ పెడితే ఆయన ఓ మంచి సందేశం ఇస్తారనుకున్నట్లు తెలిపారు. అయితే ప్రెస్ మీట్ లో బట్టి పట్టి రియల్ హీరోగా కాకుండా రిల్ హీరోగా ప్రవర్తించిన తీరు కనబడుతుందన్నారు. మీరు మూడు సంవత్సరాలు కష్టపడి తీసిన సినిమా నష్టం జరగద్దనే ఉద్దేశంతోనే టికెట్ ధరలు పెంచినా కూడా ప్రభుత్వం ఒప్పుకుందని అల్లు అర్జున్ కు ఎంపీ గుర్తుచేశారు.

రానున్న రోజులలో ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతమైతే బెనిపిట్ షోలకు పర్మిషన్ కూడా ఇవ్వమని సీఎం రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారని గుర్తుచేశారు. ఆరోజు సంధ్య థియేటర్లో మీరు సినిమా చూస్తున్నప్పుడు బయట అంబులెన్స్ వచ్చిందని, అంతా గందరగోళంగా ఉందని, ఏం జరుగుతుందనే ధ్యాస మీకు లేదని అల్లు అర్జున్ కు ఎంపీ కిరణ్ గుర్తుచేశారు.
మీకు సినిమా కలెక్షన్ల మీద ధ్యాస ఉంది తప్ప, ప్రజలు ఏమైతుండ్రు బయట ఏం జరుగుతుందనే ధ్యాస మీకు లేదని అల్లు అర్జున్ కు చురకలు అంటించారు. మీరు రియల్ హీరోగా మాట్లాడలేదు స్క్రిప్టు తీసుకొచ్చి చదివిన విధంగా ఉందన్నారు. ప్రజలకు ఏం సంజాయిషీ ఇస్తారో మీకే క్లారిటీ లేదన్నారు. నిన్నటి ప్రెస్ మీట్ లో మీరు మాట్లాడిన తీరు బాధ్యతాయుతంగా ఉండాలి కానీ ప్రజలను నష్టపరిచే విధంగా ఉండొద్దన్నారు. తన క్యారెక్టర్ ను దెబ్బతీశారని అల్లు అర్జున్ అనడం విడ్డూరంగా ఉందన్నారు. సినిమాలోనే హీరో కాదు బయట కూడా హీరోలాగా వివరించాలని అల్లు అర్జున్ ని కోరారు.












Click it and Unblock the Notifications