ఎవడయ్యా తెలుగు మహాసభలు పెట్టినోడు
Chamala Kiran Kumar Reddy: హైదరాబాద్ నోవాటెల్ హోటల్‌లో ఏర్పాటైన ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎదురైన చేదు అనుభవం పట్ల అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడుతున్నారు. మహాసభల నిర్వాహకులు, యాంకర్‌పై విమర్శలు గుప్పిస్తోన్నారు.
రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన విషయం తెలిసిందే. దీనికి యాంకర్‌గా వ్యవహరించారు నటుడు బాలాదిత్య. సభా ప్రాంగణంలో రేవంత్ రెడ్డి అడుగు పెట్టిన సందర్భంగా ఆయనకు స్వాగతం పలికారు యాంకర్. ఆ సమయంలో మన ప్రియతమ నాయకులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కిరణ్ కుమార్ గారు.. అంటూ పలికారు.

ఇది అక్కడున్న వారిని షాక్‌కు గురి చేసింది. దీనికి సంబంధించిన ఓ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రేవంత్ రెడ్డికి బదులుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పేరును పలకడం పట్ల తీవ్ర దుమారానికి దారి తీసినట్టయింది.
ఈ ఘటన పట్ల కాంగ్రెస్ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోన్నారు. తాజాగా భువనగిరి లోక్‌సభ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఘాటుగా స్పందించారు. రేవంత్ రెడ్డి పేరును మార్చి చెప్పడం వెనుక కుట్ర ఉందంటూ అనుమానాలను వ్యక్తం చేశారు. తెలుగు మహాసభలు పెట్టిన వాళ్లకు బుద్ధి లేదా?, యాంకర్‌కు ముఖ్యమంత్రి ఎవరో కూడా తెలియదా? అంటూ నిప్పులు చెరిగారు.
ఎవడయ్యా తెలుగు మహాసభలు పెట్టినోడు.. బుద్ధి లేదా?.. యాంకర్ అనేటోడికి చదువు రాదా? అని చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవరో తెలియనివాడు యాంకర్ కూడా అవుతాడా?, బాధ్యత లేదా?.. అంటూ ధ్వజమెత్తారు.
ఒక ఎంపీగా ఉంటూ కూడా తాను చిన్న చిన్న విషయాలను కూడా ఇలా పేపర్ మీద రాసుకుని మాట్లాడుతున్నానని ఓ కాగితాన్ని చూపించారాయన. ఒక ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఏ ముఖ్యమంత్రి వచ్చాడో కూడ తెలియకుండా పేపర్ మీద రాసింది చదువుతాడా? అంటూ నిలదీశారు. దీని వెనుక ఏదో కుట్ర ఉందనిపిస్తోందని చామల కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు.












Click it and Unblock the Notifications