కేఎల్ఆర్ ఇంటికి కాంగ్రెస్ కార్యదర్శులు - ఏం జరిగింది..!!
కర్ణాటక తరువాత ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణపై గురి పెట్టింది. ఎలాగైనా అధికారంలోకి రావాలని భావిస్తోంది. హైకమాండ్ నేరుగా ప్రతీ అంశాన్ని పర్యవేక్షిస్తోంది. జిల్లాలు..నియోజకవర్గాల వారీగా ముఖ్య నేతలను రంగంలోకి దించుతోంది. అందులో భాగంగా తాజాగా పార్టీ సీనియర్ నేత కిచ్చెన్న గారి లక్ష్యారెడ్డి ఇంటికి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు వచ్చారు. కేఎల్ఆర్ తో భేటీ అయి రంగారెడ్డి జిల్లాలో పార్టీ వ్యవహారాల పైన చర్చించారు. ఈ భేటీ కాంగ్రెస్ లో ఆసక్తి కరంగా మారింది.
కేఎల్ఆర్ తో భేటీ వెనుక : తెలంగాణలో కాంగ్రెస్ హైకమాండ్ కొత్త నేతల చేరికలను ప్రోత్సహిస్తూనే...సమర్ధవంతమైన నేతలకు జిల్లాల బాధ్యతలు కేటాయిస్తోంది. పార్టీ గెలుపు కోసం ప్రజలను ప్రభావితం చేయగలగిని నేతలకు ప్రాధాన్యత ఇస్తోంది. రంగారెడ్డి జిల్లా తొలి నుంచి కాంగ్రెస్ కు కంచుకోటగా ఉంది.

ఇప్పుడు కేఎల్ఆర్ కు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పార్టీ బాధ్యతలను అప్పగించారు. గతంలో మేడ్చల్ ఎమ్మెల్యేగా పని చేసిన కేఎల్ఆర్ కాంగ్రెస్ నాయకత్వానికి విధేయుడిగా ఉన్నారు. బీఆర్ఎస్ తో పోటీ వేళ కీలకమైన రంగారెడ్డి జిల్లాలో కేఎల్ఆర్ కు ఉన్న పట్టుతో జిల్లా సమీకరణాలపై ఈ భేటీలో చర్చ జరిగిందని సమాచారం. అదే సమయంలో ఆర్దిక, అంగ బలం కలిగిన కేఎల్ఆర్ సేవలను జిల్లాలో సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ నిర్ణయించింది.
రంగారెడ్డి బాధ్యతల్లో : రంగారెడ్డి జిల్లా తొలి నుంచి కాంగ్రెస్ కు కంచుకోటగా ఉంది. అక్కడ కాంగ్రెస్ నుంచి గెలిచిన నేతలు గులాబీ కండువా కప్పుకున్నారు. ప్రతీ నియోజకవర్గం పైనా ఫోకస్ పెట్టాలని..పార్టీ శ్రేణులను ఎన్నికలకు సంసిద్దులను చేసేలా కార్యాచరణతో రంగంలోకి దిగాని పార్టీ ముఖ్య నేతలు కేఎల్ఆర్ కు సూచించారు. ప్రజలను ఆకట్టుకొనే విధంగా నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలకు రూపకల్పన చేయాలని కోరారు.
దీంతో ఇప్పుడు కేఎల్ఆర్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఒక్కో నియోజకవర్గంలో పర్యటనలు ప్రారంభించారు. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోనూ కేఎల్ఆర్ కు పట్టు ఉండటంతో ఆ లోక్ సభ నియోజకవర్గంపై నేతలు ఫీడ్ బ్యాక్ తీసుసకున్నారు. చేవెళ్ల అసెంబ్లీ పరిధిలోని పార్టీ కీలక నేతలతో సమావేశమైన కేఎల్ఆర్ తనకు పార్టీ అప్పగించిన ఆపరేషన్ రంగారెడ్డి ప్రారంభించారు.

హైకమాండ్ కు నివేదికలు : మేడ్చల్ పరిధిలో బోనాల వేడుకల సమయంలోనూ దాదాపు వెయ్యి బైక్ లతో కేఎల్ఆర్ అభిమానులు బైక్ ర్యాలీతో ఆహ్వానించారు. మేడ్చల్ తో పాటుగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ప్రతీ నియోజకవర్గంలో ఇప్పుడు కేఎల్ఆర్ నుంచి పార్టీ నివేదికలు కోరింది. అవి అభ్యర్ధుల ఖరారులో కీలకం అయ్యే అవకాశం కనిపిస్తోంది.
పార్టీ క్షేత్ర స్థాయి పరిస్థితి నుంచి ప్రతీ అంశం పైనా సమాచారం కోరినట్లు తెలుస్తోంది. హైకమాండ్ తో టచ్ లో ఉంటున్న కేఎల్ఆర్ ఎన్నికల వేళ కీలకంగా మారారు. కేఎల్ఆర్ నివాసానికి పార్టీ జాతీయ కార్యదర్శులు రావటం.. బాధ్యతలు అప్పగించటంతో ఆ జిల్లా పార్టీ నిర్ణయాల్లో కేఎల్ఆర్ కేంద్రంగా రంగారెడ్డి కాంగ్రెస్ రాజకీయం నడుస్తోంది.












Click it and Unblock the Notifications