తెలంగాణా కాంగ్రెస్ స్పెషల్ మేనిఫెస్టో అదిరిపోయిందిగా.. ఓటర్ల దృష్టిని ఆకర్షించే 23హామీలివే!!
తెలంగాణ లోక్సభ ఎన్నికలలో విజయం సాధించడానికి, తెలంగాణ ప్రజల మద్దతును కూడగట్టడానికి కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక ఎన్నికల మేనిఫెస్టోను ఈరోజు రిలీజ్ చేసింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ మేనిఫెస్టో పాంచ్ న్యాయ్, పచ్చీస్ గ్యారెంటీ ల పేరుతో విడుదల చేసిన మేనిఫెస్టో తో పాటు, తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక మేనిఫెస్టో కూడా రిలీజ్ చేసిన కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.
తెలంగాణా కాంగ్రెస్ స్పెషల్ మేనిఫెస్టో
రాష్ట్రానికి సంబంధించి 23 హామీలు, 5న్యాయాలతో కూడిన ప్రదేశ్ కాంగ్రెస్ మేనిఫెస్టోను AICC ఇంఛార్జ్ దీపా దాస్ మున్షీ ఈ రోజు హైదరాబాద్ లోని గాంధీభవన్లో విడుదల చేశారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని పరిష్కరించని అంశాలను పరిష్కరిస్తామనీ, నీతీ ఆయోగ్ ప్రాంతీయ కార్యాలయం, క్రీడల విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామనీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ప్రాంతీయ విభాగం ఏర్పాటు, నేషనల్ ఏవియేషన్ విభాగాన్ని ఏర్పాటు చేస్తామని ఈ మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించింది.

ఆ గ్రామాలు మళ్ళీ తెలంగాణాలోకి
అంతేకాదు ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనమైన ఐదు గ్రామాలైన ఏటపాక, గుండాల, పురుషోత్తం పట్నం, కన్నె గూడెం, పిచ్చుకల పాడు లను తిరిగి తెలంగాణలో విలీనం చేస్తామని పేర్కొంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని, నూతన ఎయిర్పోర్ట్ లను ఏర్పాటు చేస్తామని, నీతి ఆయోగ్ ప్రాంతీయ కార్యాలయం హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తామని పేర్కొంది.
మేనిఫెస్టో అంశాలివే
రామగుండం మణుగూరు నూతన రైల్వే లైన్ ఏర్పాటు, కేంద్రీయ విద్యాలయాల పెంపు, నవోదయ విద్యాలయాల సంఖ్య రెట్టింపు, నాలుగు నూతన సైనిక్ పాఠశాలల ఏర్పాటు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఏర్పాటు, జాతీయ క్రీడల విశ్వవిద్యాలయం, హైదరాబాద్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఏర్పాటు చేస్తామని వెల్లడించింది.

మేడారం జాతరకు జాతీయ హోదా
మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ హోదా ఇస్తామని తెలిపింది. ఐటిఐఆర్ ప్రాజెక్టు పునః ప్రారంభం చేస్తామని పేర్కొంది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పక్కనుంచి రాపిడ్ రైల్వే వ్యవస్థ, మైనింగ్ విశ్వవిద్యాలయం, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో వెల్లడించింది. ప్రతి ఇంటికి సౌరశక్తితో కూడిన సొంత విద్యుత్ ఉత్పత్తి వ్యవస్థను ఏర్పాటు చేస్తామని వెల్లడించింది.
సుప్రీంకోర్టు బెంచ్..ఇండస్ట్రియల్ కారిడార్ల ఏర్పాటు
హైదరాబాద్ బెంగళూరు ఐటి, ఇండస్ట్రియల్ కారిడార్, హైదరాబాద్ నాగపూర్ ఇండస్ట్రియల్ కారిడార్, హైదరాబాద్ వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్, హైదరాబాద్ నుంచి నల్గొండ మీదుగా మిర్యాలగూడ ఇండస్ట్రియల్ కారిడార్, సింగరేణి పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేస్తామని పేర్కొంది. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సాంస్కృతిక వినోద కేంద్రం ఏర్పాటు చేస్తామని, హైదరాబాద్లో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని, డ్రై పోర్టు ఏర్పాటు చేస్తామని పేర్కొంది.
Congress Telangana Manifesto Released at Gandhi Bhavan.
— Congress for Telangana (@Congress4TS) May 3, 2024
గాంధీభవన్ లో తెలంగాణ మేనిఫెస్టో విడుదల
-- కాంగ్రెస్ పార్టీ జాతీయ మేనిఫెస్టోతో పాటు... తెలంగాణ ప్రజలకు ప్రత్యేక హామీలు.
-- Along with the National Manifesto of the Congress Party... special assurances to the people of… pic.twitter.com/MWGXWNQJCq
రాష్ట్రానికి ప్రాదాన్యతాంశాలతో మేనిఫెస్టో
కేంద్ర వైద్య పరిశోధనా సంస్థ ఏర్పాటు చేస్తామని, భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ క్యాంపస్ ఏర్పాటు చేస్తామని , ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. రాష్ట్రంలో ప్రాధాన్యతపై చేపట్టే అంశాలను ఇందులో పొందుపరిచింది కాంగ్రెస్ పార్టీ.
కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రజలకు చేరువ చెయ్యాలి : దీపాదాస్ మున్షీ
ఈ సందర్భంగా దీపా దాస్ మున్షీ మాట్లాడుతూ, BJP నాయకుల మాటలు ప్రజల్లో భయాందోళనలను కల్గిస్తోందని అన్నారు. రాహుల్ గాంధీ న్యాయయాత్ర BJP నాయకుల్లో అందోళన కల్పిస్తున్న కారణంగానే వారు ప్రజల్లో భయాన్ని వ్యాప్తి చేస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను ప్రజలకు చేరువ చేయాలని కూడా ఆమె కార్యకర్తలను కోరారు.












Click it and Unblock the Notifications