తెలంగాణాలో స్కూల్స్ పై కరోనా పంజా .. జగిత్యాల, సిరిసిల్ల స్కూల్స్ లో 37 మందికి కరోనా
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కలకలం మొదలైంది. రాష్ట్రంలో విద్యార్థులపై కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. మొన్నటి వరకు కాస్త తగ్గినట్టు కనిపించిన కరోనా కేసులు మరోమారు విజృంభిస్తున్నాయి. రాష్ట్రంలో గత 24 గంటల వ్యవధిలో 313 కరోనా కేసులు నమోదు కాగా, పాఠశాలల్లో కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.
కొంప ముంచుతున్న కరోనా ... భారత్ లో 40 వేలకు చేరువగా కేసులు.. మోగుతున్న డేంజర్ బెల్స్

ప్రభుత్వ గురుకుల పాఠశాలలపై పంజా విసురుతున్న కరోనా
గత ఏడాది కరోనా మహమ్మారి కారణంగా విధించిన లాక్ డౌన్ తో విద్యా సంవత్సరానికి దూరమైన విద్యార్థులు ఇప్పుడిప్పుడే స్కూల్స్ కు వెళ్తున్నారు . ఇక తాజాగా పాఠశాల విద్యార్థులపై కరోనా మహమ్మారి తన పంజా విసురుతుంది. గత కొన్ని రోజులుగా ప్రభుత్వ గురుకుల పాఠశాలలో కరోనా బారిన పడుతున్న విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. తాజాగా జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలలో రెండు బాలికల పాఠశాలలో 37 మంది కరోనా సోకడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

జగిత్యాల జిల్లా బాలికల గురుకుల పాఠశాలలో 32 మంది విద్యార్థులు, 5గురు టీచర్లకు కరోనా
జగిత్యాల సిరిసిల్ల జిల్లాలలో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన వారిలో 32 మంది విద్యార్థులు కాగా, ఐదుగురు టీచర్లు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాలలో రెండు వందల మంది విద్యార్థులు ఉండగా, వారిలో 20 మంది జ్వరంతో బాధపడుతున్నారు. గత రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా 17 మంది బాలికలు, ఐదుగురు ఉపాధ్యాయులకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. వారిని వసతి గృహం లోనే ఉంచి చికిత్స అందిస్తున్నారు.

సిరిసిల్ల జిల్లా కస్తూర్బా బాలికల పాఠశాలలో 15 మందికి కరోనా
ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం లోని కస్తూర్బా బాలికల పాఠశాలలో 15 మంది విద్యార్థినులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. పాఠశాలలో విద్యార్థులు అనారోగ్యం బారిన పడుతుండటం తో పరీక్షలు నిర్వహించిన క్రమంలో వీరికి కరోనా పాజిటివ్ గా తేలింది. పాఠశాల లోని 6, 7 ,8, 9 తరగతులకు చెందిన 62 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా, వారిలో 15 మందికి కరోనా నిర్ధారణ అయిందని, ఐసోలేషన్ లో ఉంచి వారికి చికిత్స అందిస్తున్నామని మండల వైద్యాధికారి తెలిపారు . మరోపక్క హైదరాబాద్ నగరంలోనూ పాఠశాలలు ,వసతి గృహాలలో కరోనా మహమ్మారి విపరీతంగా ప్రబలుతోంది.