కోవ్యాగ్జిన్‌పై భారత్ బయోటెక్ కీలక నిర్ణయం: రాష్ట్ర ప్రభుత్వాలకు సరఫరా చేసే డోసు రేటు తగ్గింపు
హైదరాబాద్: హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తోన్న భారత్ బయోటెక్.. ఎట్టకేలకు దిగొచ్చింది. ప్రాణాంతక కరోనా వైరస్‌ను నిర్మూలించడానికి ఉద్దేశించిన కోవ్యాగ్జిన్‌ను అభివృద్ధి చేసిన ఆ సంస్థ.. తన రేటును తగ్గించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు సరఫరా చేయడానికి ఇదివరకు డోసుకు 600 రూపాయలు వసూలు చేస్తామని ప్రకటించిన భారత్ బయోటెక్ యాజమాన్యం తన రేటును సవరించింది. దాన్ని భారీగా తగ్గించింది. ప్రైవేటు సంస్థలకు సరఫరా చేసే వ్యాక్సిన్ డోసు రేటులో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. ఆ రేటు యధాతథంగానే ఉంటుంది.
తాము అభివృద్ధి చేసిన కోవ్యాగ్జిన్ రేటును డోసు ఒక్కింటికి రాష్ట్ర ప్రభుత్వాలకు 600 రూపాయలు, ప్రైవేటు ఆసుపత్రులు, సంస్థలకు 1,200 రూపాయలుగా నిర్ధారించిన విషయం తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. కరోనా వైరస్ సృష్టించిన సంక్షోభ పరిస్థితులను కూడా ఆయా కంపెనీలు కాసులను పిండుకుంటున్నాయంటూ పలువురు ధ్వజమెత్తారు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ అసంతృప్తిని వ్యక్తం చేశాయి. రేటు విషయాన్ని పునఃపరిశీలించాలని సూచించాయి.

దీన్ని దృష్టిలో ఉంచుకుని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ తన విక్రయిస్తోన్న కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసు రేటును తగ్గించిన విషయం తెలిసిందే. డోసు ఒక్కింటికి 400 నుంచి 300 రూపాయలకు తగ్గించింది. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ తన నిర్ణయాన్ని ప్రకటించిన మరుసటి రోజే.. ఇక భారత్ బయోటెక్ కూడా రేటును సవరించింది. ఇదివరకు రాష్ట్ర ప్రభుత్వాలకు సరఫరా చేయడానికి ఉద్దేశించిన వ్యాక్సిన్ డోసు ఒక్కింటికీ 600 రూపాయలుగా నిర్ధారించగా.. దాన్ని 400 రూపాయలకు తగ్గించింది. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఓ ప్రకటన విడుదల చేసింది.
కరోనా వైరస్ వల్ల దేశవ్యాప్తంగా సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయని, వాటిని పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వాలకు సరఫరా చేసే వ్యాక్సిన్ రేటును 600 రూపాయల నుంచి 400 రూపాయలకు తగ్గించినట్లు తెలిపింది. ప్రైవేటు ఆసుపత్రులు, సంస్థలు, వ్యక్తులకు సరఫరా చేసే వ్యాక్సిన్ రేటుకు సంబంధించిన ప్రస్తావన ఏదీ తన ప్రకటనలో పొందుపరచలేదు. ప్రైవేటు ఆసుపత్రులకు విక్రయించే రేటు డోసు ఒక్కింటికి 1,200 రూపాయలుగా ఇదివరకే నిర్ధారించింది. అందులో ఎలాంటి తగ్గింపు గానీ, సవరణలు గానీ చేయలేదనేది ఈ తాజాగా ప్రకటనతో స్పష్టమైంది.












Click it and Unblock the Notifications