ఐదు సూత్రాల పథకం సృష్టికర్త.!సంజయ్ గాంధీ జయంతి సందర్బంగా వీహెచ్ ఘన నివాళి.!
హైదరాబాద్ : కాంగ్రెస్ నేత సంజయ్ గాంధీ జయంతి సందర్భంగా మంగళవారం నాడు గాంధీ భవన్ లో జరిగిన కార్యక్రమంలో మాజీ పీసీసీ అధ్యక్షులు వి.హనుమంతరావు పాల్గొని సంజయ్ గాంధీ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వి.హెచ్ మాట్లాడారు. సంజయ్ గాంధీ తక్కువ మాటల్లో ఎక్కువ అర్థం వచ్చే సందేశాలను ఎదుటి వారికి స్పష్టంగా పంపించడం ఆయన ప్రత్యేకత అని విహెచ్ గుర్తు చేసారు. సంజయ్ గాంధీ చేపట్టిన ఐదు సూత్రాల కార్యక్రమం సరైందనీ, ఆచరణయోగ్యమైందని ఇప్పుడు అందరూ అదే ఆచరిస్తున్నారని అన్నారు. కుటుంబ నియంత్రణ జరగకుండా భారత్‌లో పేదరికాన్ని రూపుమాపడం సాధ్యం కాదని ఆయన భావించేవాడని, అట్లాగే చెట్లు నాటడం, వివిధ వస్తువులు భారత్‌లోనే తయారు కావాలనేది సంజయ్ గాంధీ ఉద్దేశంగా ఉండేదని అన్నారు.

సంజయ్ గాంధీ మారుతి కార్ డిజైన్ రూపొందించేందుకు వర్క్‌షాప్‌లో కూడా పని చేశారని, నేడు మారుతి కార్లు భారత్‌లోనే తయారవుతున్నాయని దాని వెనక సంజయ్ గాంధీ చొరవ ఎంతో ఉందని వీహెచ్ స్పష్టం చేసారు. ఆయనతో ఉన్న సాన్నిహిత్యాన్ని విహెచ్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. సంజయ్ గాంధీ కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ విభాగానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని, ఆయన దూరదృష్టి ఉన్న మంచి యువ నేతగా పేరుతెచ్చుకున్నారని వీహెచ్ స్పష్టం చేసారు. నేటి యువత ఆయన అడుగుజాడలలో నడవాలని వి.హెచ్ సూచించారు. ఈ కార్యక్రమంలో పిసిసి నాయకులు కుమార్ రావు, అర్. లక్ష్మణ్ యాదవ్, కొమరయ్య, డాక్టర్ రవి ఇతర నాయకులు పాల్గొన్నారు. అంతే కాకుండా టీపిసిసి అద్యక్షుడు రేవంత్ రెడ్డి ఢిల్లీలో సంజయ్ గాంధీ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు.












Click it and Unblock the Notifications