cyber crimes: ఆన్లైన్లో కొన్న చీరలు రిటర్న్; సైబర్ నేరగాళ్ళ ట్రాప్; ఖాతాలో 2లక్షల నగదు దోపిడీ!!
సైబర్ నేరగాళ్లు రోజుకోరకంగా రెచ్చిపోతున్నారు. ఆన్లైన్లో షాపింగ్ చేసే వారిని టార్గెట్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా మహిళలను టార్గెట్ చేసుకున్న సైబర్ నేరగాళ్లు వారికి బంపర్ ఆఫర్ లు అంటూ రకరకాల మెసేజ్ లను పంపుతూ మోసాలకు పాల్పడుతున్నారు. ఆన్లైన్లో షాపింగ్ చేసేవారిని టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు, వారి షాపింగ్ డేటాను, ఆర్డర్ చేసిన వస్తువులను తిరిగి రిటర్న్ చేసే డేటాను సేకరించి, తప్పుడు కస్టమర్ కేర్ నంబర్లను ఆన్లైన్ లో పెట్టి అర్థం కాకుండా మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా అటువంటి ఘటన రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలానికి చెందిన ఓ మహిళ విషయంలో చోటు చేసుకుంది.

ఆన్లైన్ లో చీరలు రిటర్న్ .. సైబర్ మోసగాళ్ళ ట్రాప్
ఇటీవల ఆన్లైన్ లో ఒక మహిళ తన కుమారుడి సహాయంతో రెండు చీరలు కొనుగోలు చేసింది. ఇంటికి వచ్చిన తర్వాత ఆ చీరలు నచ్చకపోవడంతో తిరిగి వాటిని రిటర్న్ చేయాలని భావించింది . ఈ నేపథ్యంలో ఆమె కుమారుడు ఆన్లైన్ లో సంబంధిత సంస్థ కస్టమర్ కేర్ నెంబర్ కి ఫోన్ చేశాడు. కస్టమర్ కేర్ ప్రతినిధి అంటూ ఓ వ్యక్తి హిందీలో మాట్లాడి చీరలు వెనక్కి తీసుకోవాలంటే తాను పంపిన లింకు తెరిచి వివరాలు నింపాలని సూచించాడు. దీంతో సదరు మహిళ కుమారుడు అదే విధంగా చేశాడు. బ్యాంకు ఖాతా నుంచి మొత్తం మూడు వేర్వేరు లావాదేవీల ద్వారా ఏకంగా వేలల్లో కాదు 2.04 లక్షల నగదు మాయమైంది.

బ్యాంకు ఖాతాలో 2 లక్షలకు పైగా మాయం .. పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు
అయితే ఆ విషయాన్ని వెంటనే గమనించని మహిళ తర్వాత బ్యాంకు ఖాతా లావాదేవీలను పరిశీలించగా 2.04 లక్షలు తమ నగదు నుండి విత్ డ్రా అయినట్టుగా గుర్తించారు. మొత్తం ఆమె ఖాతాలో 6.04 లక్షల నగదు ఉండగా రెండు లక్షల నాలుగు వేలు మాయం అయ్యాయి. దీంతో కంగుతిన్న బాధితులు ఈ వ్యవహారంపై రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇక సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగి ఈ కేసుపై దర్యాప్తు మొదలుపెట్టారు. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి షాపింగ్ చేస్తున్నా, వాటిని రిటర్న్ పంపాలని భావించినా జాగ్రత్తగా వ్యవహరించాలని పదేపదే సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్న పోలీసులు
సైబర్ నేరగాళ్లు ప్రజలకు అర్థం కాని విధంగా వారిని ట్రాప్ చేస్తూ మోసం చేస్తున్నారని, పొరపాటున కూడా ఎవరు ఏం చెప్పినా, అనుమానాస్పదంగా వచ్చిన లింకులను ఓపెన్ చేయొద్దని హెచ్చరిస్తున్నారు. ఇక సైబర్ నేరాలకు గురైన బాధితులు వెంటనే 1930 నెంబర్ కి ఫోన్ చేసి తమ ఫిర్యాదులను చేయాలని సూచిస్తున్నారు. సైబర్ నేరాలు జరిగిన వెంటనే ఫిర్యాదు చేస్తే, నేరపరిశోధన సులభమవుతుందని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. అంతేకాదు ఇలా ఫిర్యాదు చేయడం వల్ల సైబర్ దాడుల వల్ల జరిగిన నష్టాన్ని త్వరితగతిన పరిష్కరించడానికి వీలు కలుగుతుందని పోలీసులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications