cyber crimes: ఈ కామర్స్ సైట్లలో లక్కీడిప్ బహుమతులు వచ్చాయని.. నమ్మారో నట్టేట ముంచేస్తారు!!
హైదరాబాద్: సైబర్ నేరగాళ్ళు రెచ్చిపోతున్నారు. ఈ కామర్స్ సైట్ల ద్వారా వస్తువులను కొనుగోలు చేసే వారిని టార్గెట్ చేస్తున్నారు. మీకు లక్కీ డిప్ లో బహుమతులు వచ్చాయని ఫోన్ కాల్స్ చేస్తున్నారు. కార్లు బహుమతులుగా వచ్చాయని, వాటిని పొందటం కోసం కొంత మొత్తం చెల్లించాలని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు . ఇక నమ్మితే అంతే అంటున్నారు పోలీసులు .

ఈ కామర్స్ సైట్ల డేటాతో సైబర్ మోసాలు .. ఫోన్ నంబర్లకు మెసేజ్ లు
ఆన్లైన్ విక్రయాలు జోరుగా పెరగటంతో సైబర్ నేరగాళ్ళు ఆన్ లైన్ ఈ కామర్స్ సైట్ లను కూడా వదిలిపెట్టటం లేదు. ఈ కామర్స్ సైట్ల ద్వారా వస్తువులను కొనుగోలు చేసే వారి జాబితాను సదరు సైట్లలో పని చేసే ఉద్యోగులకు డబ్బులు ఆశ చూపించి సేకరించి ఆపై పని మొదలు పెడుతున్నారు. మీరు ఫలానా ఈకామర్స్ సైట్ లో చేసిన కొనుగోళ్ళపై మీకు బహుమతులు వచ్చాయని ఫోన్ నంబర్ కు మెసేజ్ చేస్తున్నారు. ఆపై ఎవరైనా అది నిజం అని నమ్మి వారికి కాల్ చేస్తే ఇక బురిడీ కొట్టించే పని చేస్తున్నారు.

కార్లు, నగదు బహుమతులు గెలుచుకున్నారంటూ.. డబ్బులు కట్టాలని ట్రాప్
ఫోన్ నంబర్ కు వారు చేసే మెసేజ్ లో ఈ బహుమతి మీరు పొందాలంటే ఇందులో ఉన్న టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చెయ్యాలని రాసి ఉంటుంది. ఆ నంబర్ కు ఫోన్ చేస్తే అవతల కస్టమర్ ఎగ్జిక్యూటివ్ గా నమ్మించే ప్రయత్నం చేసే సైబర్ నేరగాడు,మీరు కారు గెలుచుకున్నారు, ఇది పొందాలంటే కొంత మొత్తం మొదట చెల్లించాలి, తర్వాత మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాం అని ఏవేవో కట్టుకథలు చెప్పి నమ్మించే ప్రయత్నం చేస్తారు. ఇక లక్షల విలువ చేసే కార్ సొంతం చేసుకోవాలంటే రిజిస్ట్రేషన్ ఫీజు, ఆర్టీవో ఛార్జీలు, డెలివరీ చార్జ్, డ్రైవర్ చార్జ్ అంటూ దాదాపు రెండున్నర లక్షల దాకా లెక్కలు చెప్తారు. ఇక కారు మాత్రమే కాదు నగదు బహుమతులు కూడా గెలుచుకున్నారు అంటూ మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు.

హైదరాబాద్ లో ఈ తరహా మోసాలు.. లబోదిబోమంటున్న బాధితులు
ఇటీవల కాలంలో ఈ తరహా మోసాలు బాగా పెరిగిపోయాయి. సైబరాబాద్ ప్రాంతానికి చెందిన ఒక యువతీ ఇదే తరహాలో మోసపోయింది. సైబర్ నేరగాళ్ళ వలలో చిక్కి కారు బహుమతి వచ్చింది అంటే నమ్మి ఏకంగా 2న్నర లక్షలకు పైగా వారికి సమర్పించుకుంది. ఇక కూకట్ పల్లిలోనూ ఇదే తరహా మోసం జరిగింది. కూకట్ పల్లిలో ఒక యువకుడు 6.50 లక్షల నగదు గెలుచుకున్నారని సైబర్ నేరగాళ్ళ మాయ మాటల్లో చిక్కి ఏకంగా 3.21లక్షలు పోగొట్టుకున్నారు. ఆపై లబోదిబోమన్నారు.

ఈ కామర్స్ సైట్లలో వస్తువులు కొంటున్నారా.. అయితే జాగ్రత్త .. పోలీసుల హెచ్చరిక
అందుకే పోలీసులు ఈ కామర్స్ సైట్లలో కొనుగోలు చేసే వారు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. లక్కీ డ్రా వచ్చిందని ఎలాంటి మెసేజ్ వచ్చినా స్పందించకూడదు అని చెప్తున్నారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఎలాంటి వ్యక్తిగత సమాచారం అగంతకులకు చెప్పకూడదని, ఆధార్, బ్యాంకు ఖాతాల డీటైల్స్ ఇవ్వకూడదని చెప్తున్నారు. అంతేకాదు ఓటీపీ లను ఎవరికీ చెప్పకూడదని సూచిస్తున్నారు. ఎట్టి పరిస్థితులలోనూ ఎవరినీ నమ్మి మీ డబ్బులను పంపకూడదు అని చెప్తున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఉండదని ముందుగానే జాగ్రత్తలు పాటించాలని చెప్తున్నారు.












Click it and Unblock the Notifications