గర్భిణి హత్య: వదిలించుకోవాలని 'నాగ్‌పూర్' లోనే అలా!,.. తిరిగొచ్చి బలైపోయింది..
Recommended Video

హైదరాబాద్: గచ్చిబౌలి బొటానికల్ గార్డెన్ సమీపంలో జరిగిన గర్భిణీ హత్య కేసులో పూర్తి వివరాలు పోలీసులు వెల్లడించారు. అంతకుముందు నిందితులు అమర్ కాంత్ ఝా తల్లిదండ్రులను మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు.. గురువారం కీలక నిందితులైన అమర్ కాంత్ ఝా, వికాస్‌లను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా హత్య కోణాన్ని కూలంకషంగా వివరించారు.

8 రోజుల ముందే:
గతనెల 27న పింకీ(32)ని హత్య చేసిన నిందితులు.. ఎనిమిది రోజుల ముందు నుంచే దీనికి స్కెచ్ వేశారు. శవాన్ని ముక్కలు చేసేందుకు అవసరమైన గ్రానైట్ కట్టర్‌ను, ప్లాస్టిక్ సంచులను ముందుగానే కోనుగోలుచేసి ఇంట్లో దాచిపెట్టారు.

ఇలా చంపేశారు:
పింకీని చంపేందుకు అదును కోసం ఎదురుచూస్తున్న నిందితులకు గత నెల 27వ తేదీ రాత్రి అందుకు అవకాశం చిక్కింది. ఆ రాత్రి పింకీతో ఘర్షణ పడ్డ మమత.. ఆమె చెంపపై బలంగా కొట్టింది.
ఆ దెబ్బకు పింకీ కిందపడిపోవడంతో.. మమత భర్త అనిల్, కొడుకు అమర్‌కాంత్, పింకీ భర్త వికాస్ ఆమెపై తీవ్రంగా దాడి చేశారు.
పింకీ కదలకుండా.. అనిల్ ఆమె కాళ్లను గట్టిగా పట్టుకోగా వికాస్, అమర్‌కాంత్‌లు ఎక్కడపడితే అక్కడ ఆమెను కాళ్లతో తన్నారు. దీంతో అక్కడికక్కడే పింకీ ప్రాణాలు వదిలింది.

హత్య తర్వాత..:
పింకీ విగతజీవిగా మారడంతో ఆమెను బాత్రూమ్‌లో పడేశారు. తల్లిని తన ఎదుటే చంపేయడం చూసి బాలుడు బోరుమన్నాడు. దీంతో అనిల్ అతన్ని బయటకు తీసుకెళ్లగా.. శవాన్ని ఏం చేయాలన్న దానిపై అమర్‌కాంత్, వికాస్‌లు తర్జనభర్జన పడ్డారు.
ఆఖరికి గ్రానైట్ కట్టర్‌తో శవాన్ని ముక్కలుగా కోసి ప్లాస్టిక్ సంచుల్లో మూటకట్టి ఇంట్లోనే ఉంచారు. 29వ రోజు ల్లవారుజామున 3గంటల ప్రాంతంలో మూటలను తీసుకొని అమర్‌కాంత్, అతడి తల్లి మమత కలిసి బైక్‌పై వెళ్లి బొటానికల్ గార్డెన్ సమీపంలోని ఓ షాపు ఎదుట పడేసి వెళ్లిపోయారు.

పింకీతో నాలుగేళ్లు.. ఆపై..:
పింకీతో వికాస్ నాలుగైదేళ్లు సహజీవనం చేశాడు. ఆ సమయంలో బతుకుదెరువు కోసం ఇద్దరు కలిసి డెహ్రాడూన్, పుణే, బాగల్‌పూర్ లాంటి ప్రాంతాలకు వలసవెళ్లారు. అక్కడ కొంతకాలం పనిచేసి తిరిగి బిహార్‌లోని స్వగ్రామానికి వచ్చారు. గతేడాది వికాస్ పింకీని ఓ గుడిలో పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తర్వాత మమతతో వికాస్ కు వివాహేతర సంబంధం ఏర్పడటమే పింకీ హత్యకు దారితీసింది.

బీహార్ నుంచి హైదరాబాద్‌కు మకాం..:
వికాస్-మమతల మధ్య పింకీ అడ్డుగా మారడంతో.. బీహార్ నుంచి హైదరాబాద్ కు వీళ్లిద్దరు మకాం మార్చారు. మమత తొలుత వికాస్‌ను హైదరాబాద్ పంపించి.. సిద్దిఖ్‌నగర్‌లో నివాసముంటున్న తన కుమారుడి వద్ద ఉంచింది. ఆ తర్వాత రెండు నెలలకు భర్త అనిల్‌తో కలిసి తాను కూడా అమర్ కాంత్ వద్దకు వచ్చింది. స్థానికంగా వికాస్, మమత ఇద్దరూ చాట్ బండార్ నడుపుతుండగా.. అమర్ కాంత్ బార్‌లో పనిచేస్తున్నాడు.

వదిలించుకోవాలని చూసినా..:
హైదరాబాద్ వచ్చి అంతా సాఫీగా సాగిపోతుందనుకున్న తరుణంలో.. పింకీ వికాస్‌ను వెతుక్కుంటూ రావడంతో మమత ప్లాన్ అడ్డం తిరిగింది. నెలన్నర క్రితం ఆమె ఇక్కడికి రావడం మమతకు ఏమాత్రం మింగుడుపడలేదు. తిరిగి ఆమెను వెనక్కి పంపించడానికి వికాస్ చాలానే ప్రయత్నించాడు. ఓరోజు ఉన్నపలంగా బీహార్ వెళ్లిపోదామని చెప్పి ఆమెతో పాటు రైలెక్కాడు. కానీ మార్గమధ్యలో నాగ్‌పూర్ వద్ద ఆమె కళ్లుగప్పి రైలు దిగిన వికాస్ తిరిగి హైదరాబాద్ చేరుకున్నాడు

మళ్లీ తిరిగొచ్చి పింకీ బలైపోయింది..:
భర్త వికాస్ తన కళ్లుగప్పి పారిపోయినప్పటికీ.. పింకీ మళ్లీ అతన్ని వెతుక్కుంటూ 48గం.ల్లోనే సిద్దిఖ్‌నగర్ లోని అమర్ కాంత్ ఇంటి వద్దకు చేరుకుంది. పింకీ, ఆమె కొడుకు జితిన్, వికాస్, అమర్ కాంత్, మమత, అనిల్ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఒకే ఇంట్లో ఉంటుండటంతో వికాస్-మమతల వివాహేతర సంబంధానికి పింకీ అడ్డుగా మారింది. ఆర్థికంగానూ కష్టాలు మొదలయ్యాయి. దీంతో ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకుని చివరకు అనుకున్నంతా చేశారు.












Click it and Unblock the Notifications