బతికుండగా 'చంపేసిన' వైద్యులు, సోదరి ఏడుపుతో పాడెపై కళ్లు తెరిచాడు
హైదరాబాద్: చనిపోయాడని దహన సంస్కారాలకు ఏర్పాట్లు చేస్తుండగా హఠాత్తుగా కళ్లు తెరిచాడు. అప్పటిదాకా శోకసముద్రంలో మునిగిన కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఇది వైద్యుల నిర్లక్ష్యంతో జరిగింది. బతికున్న వ్యక్తినే వైద్యులు చనిపోయాడని చెప్పడంతో ఇది జరిగింది.
ఖమ్మం జిల్లా కొత్తగూడెం మండలంలోని ఓ తండాకు చెందిన బిక్కు (35) ఐదు రోజుల క్రితం ద్విచక్ర వాహనం పైనుంచి కిందపడ్డాడు. అతని తలకు గాయమైంది. కుటుంబ సభ్యులు కొత్తగూడెం, ఖమ్మం ఆసుపత్రులకు తీసుకెళ్లారు.
మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లాలని స్థానిక వైద్యులు సూచించారు. దీంతో అతనిని నాలుగు రోజుల క్రితం హైదరాబాద్‌లోని గాంధీకి తీసుకొచ్చారు.

వైద్యులు చికిత్స చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారని రోగి బంధువులు ఆరోపించారు. ఈ నెల 2న రోగి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో అక్కడి వైద్యులు కొందరు చనిపోయాడని తెలిపి పోస్టుమార్టం చేయాల్సి ఉంటుందన్నారని వారు చెప్పారు.
పోస్టుమార్టం వద్దని తమ ఇంటికి తీసుకెళ్తామని చెప్పి తీసుకొస్తూ ఖమ్మం సమీపంలో బంధువు ఇంటివద్ద అంబులెన్స్‌ను నిలిపామని, అక్కడ బిక్కును చూసి ఆయన సోదరి బిగ్గరగా రోదించిందని, అప్పుడు బిక్కులో చలనం చూశామని చెప్పారు.
బతికున్నాడని ధ్రువీకరించుకొని కొత్తగూడెం ఏరియా ఆసుపత్రిలో చేర్పించి వైద్యం చేయిస్తున్నామన్నారు. దీనిపై స్థానిక మాజీ సర్పంచ్ బద్రు స్థానిక ఎమ్మెల్యే ద్వారా మంత్రి లక్ష్మారెడ్డికి ఫిర్యాదు చేశారు. గాంధీ వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందన్నారు. మరోవైపు, గాంధీలో అలాంటిది జరగలేదని చెబుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications