మూసీపై బిగ్ స్టెప్- చెప్పిందే చేసిన రేవంత్
మూసీ నది పునరుజ్జీవన కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి ఓ కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైంది. ఈ మేరకు ఆదేశాలు జారీ అయ్యాయి. నది పర్యావరణ పునరుద్ధరణ, వరదల నివారణ, పట్టణ పరివర్తన, సుస్థిర అభివృద్ధికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిచ్చే క్రమంలో ఈ ప్రాజెక్ట్ ను చేపట్టింది ప్రభుత్వం. దీనికి సంబంధించిన పనులు, ఇతరత్రా అంశాలను సమన్వయం చేయడానికి, ఆదేశాలను అమలు చేయడానికి ఈ కమిటీ తెరమీదికి వచ్చింది.
మూసీ నది సమగ్రాభివృద్ధి, పునర్జీవనం, నిర్వహణ లక్ష్యంగా ఉన్నత స్థాయిలో స్పష్టమైన మార్గదర్శకత్వం, అంతర్-విభాగ సమన్వయం చేసుకోవడం, పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తుందీ సబ్ కమిటీ. దీనికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. సమాచార సాంకేతిక, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్, పరిశ్రమలు, వాణిజ్య శాఖల మంత్రి డీ శ్రీధర్ బాబు, హైదరాబాద్ ఇన్ ఛార్జీ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ ఉపసంఘంలో సభ్యులుగా ఉంటారు.

మూసీ నది అభివృద్ధి సంస్థ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కమిటీ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్లు, గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్‌లు, అలాగే హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ మేనేజింగ్ డైరెక్టర్లు అవసరాన్ని బట్టి కమిటీ సమావేశాలకు హాజరు కావాల్సి ఉంటుంది. అవసరమని భావిస్తే ఇతర అధికారులను కూడా సమావేశాలకు పిలవొచ్చు.
ఈ క్యాబినెట్ ఉపసంఘం మూసీ పునరుజ్జీవనం కోసం సమగ్ర పాలసీ దిశానిర్దేశం, వ్యూహాత్మక మార్గదర్శకాలను అందించనుంది. నదీ పునరుద్ధరణ, మురుగునీటి నిర్వహణ, వరదల నివారణ, నది ఒడ్డు అభివృద్ధి వంటి ప్రాజెక్ట్ భాగాల పురోగతిని ఇది సమీక్షిస్తుంది. సంబంధిత విభాగాలు, ఏజెన్సీల మధ్య సమన్వయాన్ని సులభతరం చేయడమే గాక, భూ సంబంధిత సమస్యలు, పునరావాసం, నిధులు వంటి ముఖ్యమైన అమలు సమస్యలను కూడా పరిష్కరిస్తుంది.
ప్రాజెక్టును సమర్థవంతంగా, నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేయడానికి అవసరమైన ఆదేశాలను సైతం ఉపసంఘం జారీ చేస్తుంది. కమిటీ సమావేశాలు క్రమం తప్పకుండా జరిగేలా, తీసుకున్న నిర్ణయాలపై తదుపరి చర్యలను నిశితంగా పర్యవేక్షించే బాధ్యత కన్వీనర్‌పై ఉంటుంది.












Click it and Unblock the Notifications