భారీ భూస్కాంలో తలసాని: డిగ్గీ సంచలనం, కింది ఉద్యోగులే బలి: రేవంత్
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుపై కాంగ్రెస్ జాతీయ నేత దిగ్విజయ్ సింగ్, తెలుగుపార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వేర్వేరుగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ సర్కారు అవినీతిమయంగా మారిపోయిందని ఆరోపించారు.
రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం 3 స్కాములు, 6అవినీతి కేసులతో సాగుతోందని ఎద్దేవా చేశారు. ఎంసెట్, నయీమ్, మియాపూర్ భూ దందా పెద్ద కుంభకోణాలేనని అన్నారు. రిజిస్ట్రేషన్ ఫీజులు ఎగ్గొట్టడమే కాకుండా వేలకోట్ల విలువైన భూములను కాజేశారని ఆరోపించారు.
ఈ కుంభకోణాల్లో కింది ఉద్యోగులను బలిచేస్తున్నారని రేవంత్ మండిపడ్డారు. మొత్తం 7000 ఎకరాలు, 17వేల కోట్ల స్కాం జరిగిందని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం కీలక నిందితులకు తప్పించుకునే వీలు కల్పిస్తోందని మండిపడ్డారు.

ముఖ్యమంత్రి కార్యాలయమే అవినీతిమయంగా మారిందని రేవంత్ ఆరోపించారు. మియాపూర్ భూకుంభకోణం కేసును సీఐడీకి అప్పగించాలని అన్నారు. ఈ కుంభకోణంతో సంబంధమున్న డిప్యూటీ సీఎంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గోల్డెన్ ప్రసాద్‌కు ప్రాణహాని ఉందని చెప్పారు. వెంటనే ఈ కుంభకోణంపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ ప్రభుత్వంపై నమ్మకం లేదు: దిగ్విజయ్
తెలంగాణ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. మియాపూర్ భూకుంభకోణం చాలా పెద్దదని, దీనిపై కేసీఆర్ ప్రభుత్వం పారదర్శక విచారణ జరుపుతుందన్న నమ్మకం తమకు లేదని అన్నారు.
ఈ కుంభకోణంపై సీబీఐతోనే విచారణ జరిపించాలని, అలాగైతేనే వాస్తవాలు బయటపడతాయని దిగ్విజయ్ అన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు ఈ భూకుంభకోణంతో సంబంధం ఉందని సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పటికే ఆయనపై రాజకీయ ఫిరాయింపుల ఆరోపణలున్నాయని చెప్పారు. కేసీఆర్ కుటుంబానికి తలసాని సన్నిహితులని, అందుకే చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.












Click it and Unblock the Notifications