దిశా కేసు: ఎన్‌కౌంటర్ స్పెషలిస్టా మీరు? సజ్జనార్ కు సిర్పూర్కర్ కమీషన్ ప్రశ్నల వర్షం, సజ్జనార్ చెప్పిందిదే!!
ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ అని పేరు తెచ్చుకున్న సజ్జనార్ ఇప్పుడు అదే ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ అంటే ఇబ్బంది పడుతున్నారు. దిశా నిందితుల ఎన్కౌంటర్ విషయంలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిర్పూర్కర్ కమిషన్ విచారణలో సజ్జనార్ పై కమీషన్ సభ్యులు ప్రశ్నల వర్షం కురిపించారు. దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై సిర్పూర్కర్ కమిషన్ సాక్షులను విచారణ జరిపిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో సిట్ దర్యాప్తు అధికారి గా ఉన్న డిసిపి నరేందర్ రెడ్డి ని కూడా కమిషన్ విచారించింది. రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి నుంచి జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ లోని త్రిసభ్య కమిటీ కేసుకు సంబంధించిన అదనపు వివరాలను సైతం సేకరించింది. దిశ కేసులో ఎన్ కౌంటర్ లో మరణించిన నిందితుల కుటుంబాలను సైతం సిర్పూర్కర్ కమిషన్ విచారించింది.

సజ్జనార్ ను రెండు రోజులు విచారించిన సిర్పూర్కర్ కమీషన్
దిశా ఘటన, తర్వాత పరిణామాలలో భాగంగా జరిగిన ఎన్కౌంటర్లో కీలకంగా వ్యవహరించిన అప్పటి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గా ఉన్న సజ్జనార్ కు ప్రశ్నలను సంధిస్తోంది కమిషన్. దిశ ఘటన నిందితుల ఎన్ కౌంటర్ పై విచారణ చేపట్టిన త్రిసభ్య కమిషన్ సజ్జనార్ కు ఊపిరాడకుండా ప్రశ్నలను సంధిస్తోంది. సోమవారం కూడా సైబరాబాద్ కమిషనర్ గా పనిచేసిన సజ్జనార్ ను ప్రశ్నించిన కమిషన్ సభ్యులు 5 గంటల పాటు ఆయనను విచారించారు. దిశా సామూహిక హత్యాచారం సమాచారం మీకు ఎవరు ఇచ్చారు అంటూ ప్రారంభించి, నిందితుల అరెస్ట్ వరకు దిశ ఘటన సంబంధించిన అనేక వివరాలను అడిగారు. అయితే కమిషన్ ముందు సమాధానం చెప్పిన సజ్జనార్ తనకు ప్రతిరోజూ జరిగే సెట్ కాన్ఫరెన్స్ లో శంషాబాద్ డిసిపి ప్రకాష్ రెడ్డి సమాచారం ఇచ్చారని సమాధానం చెప్పారు.

కమీషన్ అడిగిన ప్రశ్నలకు అన్నిటికీ డీసీపీ చెప్పారన్న సజ్జనార్
ఇక ఈ కేసులో ప్రతిదీ తనకు డీసీపీ ప్రకాష్ రెడ్డి నుండే సమాచారం వచ్చిందని సజ్జనార్ కమిషన్ కు తెలిపారు. రాత్రి పది గంటల వరకు నిందితులను విచారించినట్లు రికార్డుల్లో ఉందని కానీ అంతకుముందే ఏడు గంటలకే విలేకరుల సమావేశం పెట్టి నిందితులు వివరాలు ఎలా వెల్లడించారని కమిటీ ప్రశ్నించగా, నేరం జరికిన విధానం, ఆపై వారిని అరెస్టు చేయడం పై తనకు డీసీపీ ప్రకాష్ రెడ్డి వివరాలన్నీ విడమరచి చెప్పారని, ఈ క్రమంలోనే ప్రెస్ మీట్ పెట్టామంటూ సమాధానమిచ్చారు సజ్జనార్.

ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ అంటే ఏమిటి అంటే తనకు తెలీదన్న సజ్జనార్
ఇక ఈరోజు మరోమారు సజ్జనార్ కు ప్రశ్నల వర్షం కురిపించారు. ఎన్ కౌంటర్ పై విచారణ చేపట్టిన త్రిసభ్య కమిషన్ ఎన్కౌంటర్ చేశారా ? మీరు ఎన్కౌంటర్ స్పెషలిస్టా ? అంటూ పలు రకాల ప్రశ్నలు వేసింది. కమిషన్ అడిగిన ప్రశ్నలకు సజ్జనార్ ఆసక్తికరమైన సమాధానాలు చెప్పారు. మిమ్మల్ని ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా మీడియా అభివర్ణించింది. మీరు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అని ఒప్పుకుంటారా అంటూ కమిషన్ ప్రశ్నించగా నేను అంగీకరించనని సమాధానం చెప్పారు సజ్జనార్. ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ అంటే ఏమిటి అని కమిషన్ వేసిన ప్రశ్నకు తనకు సమాధానం తెలియదని చెప్పారు.

ప్రతీ దానికి డిసిపిపైనే ఆధార పడతారా ? కమీషన్ ప్రశ్నకు సజ్జనార్ సమాధానం
మీరు ప్రతిదీ డిసిపి చెప్తే తెలిసింది అంటున్నారు , డిసిపి పైనే ఆధార పడతారా అని కమిషన్ ప్రశ్నించగా గ్రౌండ్ లెవెల్ లో ఆఫీసర్లకు పూర్తి సమాచారం ఉంటుంది. వారికి నేను ఫ్రీ హ్యాండ్ ఇస్తాను అంటూ సమాధానం చెప్పారు సజ్జనార్. దిశ అత్యాచారం జరిగిన రోజు ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో ఎందుకు నిర్లక్ష్యం వహించారని కమిషన్ వేసిన ప్రశ్నకు సమాధానంగా సజ్జనార్ మిస్సింగ్ కంప్లైంట్ రాగానే బాధితురాలి కోసం వెతకడం లో కొంత సమయం డిలే అయ్యిందని పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో నిర్లక్ష్యం వహించిన పోలీసులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు అంటూ ప్రశ్నించిన కమీషన్ కు సమాధానం చెప్పిన సజ్జనార్ ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో అలసత్వం వహించిన నలుగురు పోలీసు సిబ్బంది పై సస్పెన్షన్ విధించామని పేర్కొన్నారు.

కొన్ని ప్రశ్నలకు సమాధానం .. ఘటన జరిగి రెండేళ్లయ్యింది, గుర్తు లేదన్న సజ్జనార్
ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో విచారణ ముగియకముందే మీడియా సమావేశం ఎలా ఏర్పాటు చేశారని ప్రశ్నించిన కమిషన్ కు సమాధానంగా ఎన్ కౌంటర్ స్పాట్ కి మూడు వందల మీటర్ల దూరంలో విచారణకు ఆటంకం కలగకుండా మీడియా సమావేశం ఏర్పాటు చేశామని చెప్పారు సజ్జనార్. మీడియా సమావేశం కోసం కుర్చీలు బల్లలు అంత తక్కువ సమయంలో ఎక్కడి నుంచి తెచ్చారని ప్రశ్నించగా షాద్ నగర్ పోలీసులు సామాగ్రిని తెచ్చారని ఎక్కడినుంచి తెచ్చారో తనకు తెలియదన్నారు సజ్జనార్. ఇంకా కొన్ని ప్రశ్నలకు ఈ ఘటన జరిగి రెండు సంవత్సరాలు అవుతుంది కాబట్టి తనకు గుర్తు లేదంటూ సమాధానమిచ్చారు.
Recommended Video

సిర్పూర్కర్ కమీషన్ సజ్జనార్ విచారణ పూర్తి .. కమీషన్ ఏం తేల్చిందో?
మొత్తానికి దిశా నిందితుల ఎన్కౌంటర్ పై సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన సిర్పూర్కర్ కమిషన్ రెండు రోజులపాటు సజ్జనార్ ను కూడా విచారించి విచారణను పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. కమిషన్ విచారణలో ఏం తేల్చారు? దిశ ఘటన తర్వాత జరిగిన ఎన్కౌంటర్ విషయంలో కమిషన్ నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది? అన్నది ఇప్పుడు ప్రతి ఒక్కరిలో ఉత్కంఠను రేకెత్తిస్తున్న విషయం. ముఖ్యంగా పోలీస్ శాఖలో ఈ విచారణ ఏం జరుగుతుందో అన్న ప్రకంపనలను సృష్టిస్తుంది .












Click it and Unblock the Notifications