జాతీయనాయకుడి భ్రమలో కేసీఆర్; పీకేతో ఎన్ని డ్రామాలాడినా సరే ప్రజలు బీజేపీవైపే: డీకే అరుణ
టిఆర్ఎస్ ప్లీనరీలో తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై, కెసిఆర్ జాతీయ రాజకీయాలపై బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధానిని విమర్శిస్తూ కేసీఆర్ నాయకుడు కావాలని చూస్తున్నారంటూ డీకే అరుణ ఆరోపించారు. తెలంగాణా ప్రజలకు కేసీఆర్ పై విశ్వాసం పోయిందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కెసిఆర్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని, కేవలం కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగు పడిందని డీకే అరుణ ఆరోపణలు గుప్పించారు.

జాతీయ నాయకుడవుతాననే భ్రమలో కేసీఆర్ ఉన్నాడు
తెలంగాణ వచ్చినా ఉద్యోగాలు రాలేదని, రైతుల ఆత్మ హత్యలు ఆగలేదని, అమర వీరుల ఆత్మలు కన్నీరు పెట్టుకుంటున్నాయని డీకే అరుణ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పని అయిపోయిందని పేర్కొన్న డీకే అరుణ మళ్లీ అధికారంలోకి వస్తామన్న భ్రమలు ఆ పార్టీకి తొలగిపోయాయని పేర్కొన్నారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా సీఎం కేసీఆర్ మార్చారని విమర్శించారు. ప్రధాని మోడీ పై బీజేపీపై పదే పదే విమర్శలు చేస్తూ జాతీయ నాయకుడు అవుతాననే క్రమంలో కెసిఆర్ ఉన్నాడంటూ డీకే అరుణ వ్యాఖ్యానించారు.

పీకేతో కలిసి కాంగ్రెస్, టీఆర్ఎస్ ఎన్ని డ్రామాలాడినా బీజేపీకే ప్రజల పట్టం
ప్రశాంత్ కిషోర్ తో కలిసి కాంగ్రెస్ టిఆర్ఎస్ ఎన్ని డ్రామాలు ఆడినా ప్రజలు బీజేపీకే పట్టం కడతారని డీకే అరుణ అభిప్రాయం వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటుందని , ఎనిమిదేళ్లుగా సీఎం కేసీఆర్ ప్రజలకిచ్చిన హామీలను ఎంతవరకు నెరవేర్చారని డీకే అరుణ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను గాలికొదిలేసి జాతీయ రాజకీయాల గురించి సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు అంటూ డీకే అరుణ ఎద్దేవా చేశారు. ఇక ఇదే సమయంలో కెసిఆర్ జాతీయ రాజకీయాలపై మండిపడిన ఆమె భారతీయ రాష్ట్ర సమితిని ఎవరూ కోరుకోవడం లేదని వెల్లడించారు.

దళిత బంధు ఇక్కడ అమలుకాకముందే దేశంలో అమలుకు తీర్మానాలా?
దళిత బంధు పథకాన్ని తెలంగాణలో అమలు చేయకముందే దేశం మొత్తం అమలుచేయాలని ప్లీనరీలో తీర్మానం చేస్తారా అంటూ డీకే అరుణ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఉద్యోగ ప్రకటనలు నిరుద్యోగులు నమ్మడం లేదని, వాటిని ఎన్నికల నోటిఫికేషన్ లాగే చూస్తున్నారని డీకే అరుణ వ్యాఖ్యానించారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలో జరుగుతున్న అభివృద్ధి, గ్రామాలలో వైకుంఠ ధామాలు, పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికలు, సిసి రోడ్లు కేంద్ర నిధులతో చేసినవి కావా అంటూ ప్రశ్నించారు.

తెలంగాణాలో గ్రోత్ ఎక్కడుంది.. ప్రశ్నించిన డీకే అరుణ
వరి ధాన్యం కొనుగోలుకు కేంద్రం డబ్బులు ఇస్తుందని రాష్ట్ర ప్రభుత్వం కేవలం మధ్యవర్తిగా ఉంటుందని పేర్కొన్న డీకే అరుణ ప్రధాని మోడీ కి అహంకారం ఉంటే కేసీఆర్ ఇన్ని సార్లు ఆయనను కలిసేవారా అంటూ ప్రశ్నించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ఎందుకు ఆగిపోయిందో కేసీఆర్ చెప్పాలని డీకే అరుణ ప్రశ్నించారు. డబల్ ఇంజన్ సర్కార్ కాదు గ్రోత్ ఇంజన్ సర్కార్ కావాలంటున్న కేసీఆర్, అసలు తెలంగాణ రాష్ట్రంలో గ్రోత్ ఎక్కడుందో చూపించాలి అంటూ డీకే అరుణ సవాల్ విసిరారు. టిఆర్ఎస్ నేతలు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయి బీజేపీని మతతత్వ పార్టీ అంటూ విమర్శిస్తున్నారని డీకే అరుణ అసహనం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications