మంత్రి కేటీఆర్‌తో డీఎంకె ఎంపీల భేటీ... ఆ విషయంలో మద్దతు కూడగట్టేందుకు...
మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలకై నిర్వహించే నీట్(National Eligibility Entrance Test-NEET) పరీక్ష రద్దుకు తమిళ సర్కార్ కేంద్రంతో ఫైట్ చేస్తున్న సంగతి తెలిసిందే. నీట్ పరీక్ష రద్దుకు ఇప్పటికే తమిళనాడు అసెంబ్లీలో తీర్మానం చేసిన అక్కడి అధికార డీఎంకె పార్టీ జాతీయ స్థాయిలో దీనికి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తోంది.ఇందులో భాగంగా డీఎంకె పార్టీ ఎంపీలు బుధవారం(అక్టోబర్ 13) తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు.
నీట్ రద్దుపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తమిళనాడు సీఎం ఎంకె స్టాలిన్ రాసిన లేఖను డీఎంకె ఎంపీలు కేటీఆర్‌కు అందజేశారు. నీట్ రద్దుకు తమతో కలిసిరావాలని.. తమ పోరాటానికి మద్దతు పలకాలని విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా డీఎంకే ఎంపీలు తమ పార్టీ పసుపు కండువాను కేటీఆర్ మెడలో పసుపు కండువా వేశారు. కేటీఆర్‌ను కలిసినవారిలో డీఎంకె ఎంపీలు కళానిధి వీరస్వామి, ఎల్ఎం గోవింద్ తదితరులు ఉన్నారు.నీట్ సహా పలు అంశాల్లో కేంద్రంపై పోరాటానికి ఆయా రాష్ట్రాల అభిప్రాయాలను తెలుసుకుంటున్నామని ఈ సందర్భంగా డీఎంకె ఎంపీలు తెలిపారు.

నీట్ రద్దుపై తీర్మానం చేసిన తమిళనాడు ప్రభుత్వం :
తమిళనాడులో నీట్ పరీక్ష రద్దుపై ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనికి రాష్ట్రపతి ఆమోద ముద్ర పడితేనే చట్టరూపం దాల్చుతుంది.నీట్‌కు బదులు 12వ తరగతి మార్కుల ప్రాతిపదికనే మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలు చేపట్టాలని తమిళనాడు ప్రభుత్వం భావిస్తోంది.
గత యూపీఏ ప్రభుత్వ హయాంలో దేశవ్యాప్తంగా నీట్ పరీక్షను ప్రవేశపెట్టారు. అప్పుడు డీఎంకె కూడా యూపీఏలో భాగస్వామిగా ఉంది. అయితే అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి కేంద్రంతో మాట్లాడి తమిళనాడును నీట్ నుంచి మినహాయించేలా చేశారు. తమిళనాడు ప్రతిపాదనకు అప్పట్లో రాష్ట్రపతి ఆమోదం లభించింది. ప్రస్తుతం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండటంతో తమిళనాడు ప్రభుత్వానికి నీట్ నుంచి మినహాయింపు పొందడం అంత సులువుగా సాధ్యపడకపోవచ్చు.
నీట్‌తో ఎదురయ్యే సామాజిక, ఆర్థిక ప్రభావాలను అధ్యయనం చేసేందుకు గతంలో ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. నీట్ ఆధారంగా మెడికల్ కాలేజీలలో అడ్మిషన్లు పొందిన విద్యార్థులు.. 12వ తరగతి మార్కుల ఆధారంగా అడ్మిషన్లు పొందిన వారికంటే గొప్పగా ఏమీ రాణించడం లేదని అందులో తేలింది. ధనిక విద్యార్థులు మాత్రమే నీట్‌లో అధిక స్కోరు సాధించగలిగారని కమిటీ రిపోర్ట్ వెల్లడించింది.ఈ నేపథ్యంలోనే నీట్ రద్దుకు తమిళనాడు ప్రభుత్వం పట్టుబడుతోంది.ఇందుకోసం తమతో కలిసొచ్చే రాష్ట్రాలను కూడా కలుపుకుని కేంద్రంపై పోరాడాలని భావిస్తోంది.ఇందులో భాగంగా తమిళనాడు సీఎం స్టాలిన్ పలు రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు.స్టాలిన్ తనకు లేఖ రాసిన విషయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల అసెంబ్లీ వేదికగా ప్రస్తావించిన సంగతి తెలిసిందే.