నా భార్యకు న్యాయం చెయ్యండి... సెల్ టవర్ ఎక్కి భర్త ఆందోళన
ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. అయితే ఆ సమస్యలు వెంటనే పరిష్కారం కావాలని, అధికారులు పట్టించుకోవాలని డిమాండ్ చేస్తూ చాలామంది అధికారులపై ఒత్తిడి తీసుకురావడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. సెల్ టవర్ ఎక్కి ఆందోళనకు దిగడం, సదరు కార్యాలయాల ముందు నిరసన దీక్షలు చేపట్టడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు.
తాజాగా హన్మకొండలో తన భార్యకు న్యాయం చేయాలని ఓ వ్యక్తి సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపిన ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. హన్మకొండ జిల్లాలోని బాలసముద్రం లో శంకరయ్య అనే వ్యక్తి సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. తన భార్య కవిత పై ఇటీవల ముగ్గురు దాడికి పాల్పడ్డారని వారిని అరెస్ట్ చేసి తన భార్యకు న్యాయం చేయాలని సెల్ టవర్ ఎక్కి శంకరయ్య నిరసన తెలిపారు.

వారం రోజుల క్రితం కవిత పై ముగ్గురు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడికి సంబంధించి బాధితురాలు పోలీస్ స్టేషన్ లో ముగ్గురిపై ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటి వరకు ఆ ముగ్గురిని అరెస్టు చేయకపోవడంతో, ఆ ముగ్గురిని అరెస్ట్ చేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సెల్ టవర్ ఎక్కి శంకరయ్య నిరసన తెలుపుతున్నారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని శంకరయ్యను కిందికి దించే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకు న్యాయం చేస్తామని చెబుతున్నారు.
ఇక ఇదే తరహాలో ఇటీవల ఓ భూవివాదంలో కూడా హన్మకొండ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. సదరు వ్యక్తి చేస్తున్న ఆందోళనకు భార్య క్రింద నుండి మద్దతు తెలిపారు. ఇక ఇటువంటి ఘటనలు ఇటీవల కాలంలో పెరిగిపోతున్నాయి. సమస్యలకు పరిష్కార మార్గాలు వెతకలేక, ఇటువంటి తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటున్న చాలామంది, సెల్ టవర్ ఎక్కి బెదిరింపులకు పాల్పడుతున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications