తెలంగాణలోని పలు జిల్లాల్లో భూకంపం: రోడ్లపైకి పరుగులు తీసిన జనం
హైదరాబాద్: తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం భూమి కంపించింది. రాష్ట్రంలోని జగిత్యాల, రామగుండం, మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేట, గోదావరి పరివాహక గ్రామాల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దీంతో జనం భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఆదివారం సాయంత్రం 6.48 గంటలకు 3 సెకన్లపాటు భూమి కంపించింది.
రిక్టార్ స్కేలుపై భూకంప తీవ్రత 4.3గా నమోదైనట్టు సమాచారం. వేమనపల్లి మండలం గొర్లపల్లి గ్రామంలోనూ భూమి స్వల్పంగా కంపించింది. బెల్లంపల్లిలో ఓ సెకనుపాటు భూ కంపంతో ప్రజలు రోడ్లపైకి పరుగులు తీశారు.

కుమురంభీం జిల్లా కౌటాల, చింతలమానేపల్లి, బెజ్జూర్ మండలాల పరిధిలోనూ స్వల్పంగా భూ ప్రకంపనలు నమోదయ్యాయి. మహారాష్ట్రలోని గడ్చిరోలిలోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. అక్కడ కూడా 4.3 తీవ్రతతో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. నిజామాబాద్‌కు 199 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.
Recommended Video
ఆకస్మాత్తుగా వచ్చిన భూ ప్రకంపనలతో ఆయా ప్రాంతాల ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. చాలా ప్రాంతాల్లో ప్రజలు ఏం జరుగుతోందో అర్థం కాక ఆందోళనలతో ఇళ్లు వదిలి బయటికి పరుగులు తీశారు. ఇళ్లలో సామాన్లు కిందపడడం చూసి కంగారుపడ్డారు. కాసేపటికి సాధారణ స్థితి నెలకొన్నాక.. తిరిగి ఇళ్లలోకి వెళ్లారు. అయితే, ఎలాంటి, ప్రాణ, ఆస్తి నష్టం జరగకపోవడంతో ప్రజలు, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.