తొక్కిపడేస్తాడట!: మంత్రి హరీశ్ రావుపై ఈటల రాజేందర్ ఫైర్, కేసీఆర్‌పై పోటీ అందుకే
హైదరాబాద్: తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావుపై మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ సంచలన ఆరోపణలు చేశారు. మంగళవారం నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ నాయకులు రంజిత్ యాదవ్, పాశం గోపాల్ రెడ్డి తదితరులు బీజేపీలో చేరారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గం నుంచి నేరేడుచర్ల మున్సిపల్ వైస్ ఛైర్మన్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షురాలు చల్లా శ్రీలత రెడ్డి, యడపల్లి చంద్రశేఖర్ రెడ్డి, కోదాడ నుంచి ఓరుగంటి కిట్టు పలువురు తెలంగాణ ఉద్యమకారులు బీజేపీలో చేరారు.
ఈ సందర్భంగా బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ఎన్నికల నగారా మోగిన తర్వాత వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, ఆశావాహులు చాలా మంది బీజేపీలో చేరుతున్నారు. మీడియాలో చూపించకపోయినా.. ప్రజా క్షేత్రంలో బీజేపీనే సరైన వేదిక అని భావిస్తున్నారు. బీజేపీకి ఓటు వేయాలని కేసీఆర్ ను ఒడగొట్టాలని ప్రజలు భావిస్తున్నారని ఈటల చెప్పారు.

కేసీఆర్ డబ్బులతో ఎన్నికలు గెలివాలని చూస్తున్నారని ఈటల రాజేందర్ ఆరోపించారు. ఎమ్మెల్యే అభ్యర్థులకు పోలీసు పహారాలో ఇప్పటికే డబ్బులు పంపించారన్నారు. బీజేపీ నాయకులను వెలకట్టి కొనాలని చూస్తున్నారన్నారు. తలకాయ కిందపెట్టి.. కాళ్లు పైకిపెట్టినా ఈసారి కేసీఆర్ కి ప్రజలు ఓటు వేసేందుకు సిద్ధంగా లేరన్నారు ఈటల రాజేందర్.
కాంగ్రెస్ గురించి తెలంగాణ సమాజానికి తెలుసు, వారి పాలనలో ఏం జరిగిందో అందరూ చూశారు. తొమ్మిదేళ్ల పాలనలో అత్యధికంగా దోచుకున్న పార్టీ బీఆర్ఎస్ అని మండిపడ్డారు ఈటల రాజేందర్. కేసీఆర్ ఇచ్చిన అనేక హామీలు అమలు కాలేదన్నారు. హుజూరాబాద్‌లో ఎన్నికల సమయంలో తమ ప్రజలను కేసీఆర్ పెట్టిన ఇబ్బందులు చూసి.. గజ్వేల్‌లో తేల్చుకుంటా అని అప్పుడే చెప్పానని అన్నారు ఈటల.
గజ్వేల్ ప్రజల హృదయాల్లో కేసీఆర్ ఉన్నారో.. తాము ఉన్నామో 2023, నవంబర్ 30న తేలిపోతుందన్నారు. తాను పోకముందే వందలమంది మీటింగ్ పెట్టుకుని తనకు మద్దతు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారని తెలిపారు ఈటల రాజేందర్. హుజూరాబాద్ ప్రజలకు ఉపఎన్నికల్లో తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి ఎలాంటి అవకాశం వచ్చిందో.. ఇప్పుడు గజ్వేల్ ప్రజలకు అలాంటి సదావకాశం వస్తుందన్నారు. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి వారు సిద్దమవుతున్నారన్నారు.
కేసీఆర్ పాలనను అంతం చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఈటల రాజేందర్ అన్నారు. గజ్వేల్ లో పేదల భూములు గుంజుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఇస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు, మంత్రి హరీశ్ రావుపైనా ఈటల మండిపడ్డారు. ఈటల రాజేందర్‌కు మద్దతు ఇస్తే తొక్కిపడేస్తా అని హరీశ్ రావు అంటున్నారట.. తొక్కిపడేసే శక్తి అతనికి లేదు.. తొక్కిపడేసిది గజ్వేల్ ప్రజలేనని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ సర్కారుకు ప్రజలు తగినగుణపాఠం చెబుతారన్నారు. ప్రజలకు బీజేపీ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు ఈటల. బీజేపీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.












Click it and Unblock the Notifications