బీజేపీ సీఎం అభ్యర్థి నేను కాదు; నా లక్ష్యం అదేనన్న ఈటల రాజేందర్ సంచలనం
తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతోంది. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడం కోసం ఇప్పటి నుంచి రెండు పార్టీలు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఈక్రమంలో బీజేపీ సీఎం అభ్యర్థి ఎవరు అన్నది చర్చనీయాంశంగా మారింది. బీజేపీ సీఎం అభ్యర్థి బండి సంజయ్ అని కొందరు, ఈటల రాజేందర్ అని మరికొందరు, ఇక రఘునందన్ రావు వంటి నాయకులు కూడా రేసులో ఉన్నారంటూ ఆసక్తికర చర్చకు తెరతీశారు.

బీజేపీలో ఈటల.. అమిత్ షా తో భేటీతో తెరమీదకు సీఎం అభ్యర్థి చర్చ
బీజేపీ ఈటల రాజేందర్ కు చేరికల కమిటీ కన్వీనర్ గా బాధ్యతలు అప్పగించి టిఆర్ఎస్ పార్టీ నుండి కీలక నేతలను బిజెపిలోకి తీసుకురావడానికి ఆపరేషన్ ప్రారంభించింది. ఈ మేరకు ఈటల రాజేందర్ తో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చర్చలు జరిపారు. ఈటల రాజేందర్ తో అమిత్ షా భేటీ నేపథ్యంలోనే బీజేపీ సీఎం అభ్యర్థి ఆయనే అంటూ చర్చ మొదలైంది. అందుకే ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించారని అటు పార్టీల్లోనూ అంతర్గతంగా చర్చ జరిగింది. ఇక మీడియా కూడా బీజేపీ సీఎం అభ్యర్థి ఈటల రాజేందర్ అంటూ ఊహాజనిత కథనాలను ప్రసారం చేస్తోంది. ఈ క్రమంలో ఈటల రాజేందర్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తాను బీజేపీ సీఎం అభ్యర్థిని కానన్న ఈటల రాజేందర్
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ సీఎం అభ్యర్థి విషయంలో ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ముఖ్యమంత్రి అభ్యర్థి అంటూ వస్తున్న కథనాలను బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఖండించారు. ఆ వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణకు పెద్దపీట వేసే పార్టీ అని చెప్పిన ఈటల రాజేందర్ బీజేపీలో ఉన్న నాయకులు, కార్యకర్తలు పార్టీ నియమ, నిబంధనలకు కట్టుబడి ఉంటారని స్పష్టం చేశారు.

నేతల సామర్ధ్యాన్ని బట్టే అధిష్టానం నిర్ణయం
పదవులను వ్యక్తులుగా నిర్ణయించుకోలేమని పేర్కొన్న ఆయన పార్టీ నిర్ణయానికి కట్టుబడి పని చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. నేతల సామర్థ్యాన్ని గురించి సరైన నిర్ణయం తీసుకుంటారని, సీఎం అభ్యర్థి ఎవరన్నది అధిష్టానం నిర్ణయిస్తుందని ఈటల రాజేందర్ వెల్లడించారు. ఇక ముఖ్యమంత్రి అభ్యర్థి ఈటల రాజేందర్ అని పలు పత్రికలు చానళ్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలలో నిజం లేదని ఆయన పేర్కొన్నారు.
Recommended Video


తన లక్ష్యం ఇదేనన్న ఈటల రాజేందర్
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ సీఎం అభ్యర్థి ఎవరు అన్న విషయాని కంటే తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ నియంతృత్వ పాలన అంతం చేయడమే తన లక్ష్యమంటూ ఈటల రాజేందర్ పేర్కొన్నారు. తెలంగాణ గడ్డ మీద కాషాయం జెండా ఎగరవేయడం కోసం పార్టీ తనకు ఏ బాధ్యత అప్పగించినా శక్తివంచన లేకుండా, నిర్వహిస్తానని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు .












Click it and Unblock the Notifications