దేశప్రజలు కేసీఆర్‌ను బఫూన్ లా చూస్తున్నారు.. ఆయనపై దేశప్రజలకు నమ్మకమా?: ఈటల రాజేందర్
హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తెలంగాణ సీఎం కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ను దేశప్రజలు బఫూన్ లా భావిస్తున్నారని ఈటల రాజేందర్ విమర్శించారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో పర్యటించిన ఈటల రాజేందర్ చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

కూట్లో రాయి తీయలేనివాడు ఏట్లో రాయి తీస్తాడా: కేసీఆర్ పై ఈటల ఫైర్
నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ప్రతిష్టించాలని అమరవీరుల స్థూపం నిర్మాణాన్ని పూర్తి చేయాలని బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని మండిపడ్డారు ఈటల రాజేందర్. చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక ఇదే సమయంలో సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలపై మండిపడిన ఈటల కూట్లో రాయి తీయలేనివాడు ఏట్లో రాయి తీస్తాడా అంటూ ఎద్దేవా చేశారు.

కేసీఆర్ పై తెలంగాణా ప్రజలకే నమ్మకం లేదు .. దేశ ప్రజల నమ్మకమా?
నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల విశ్వాసం కోల్పోయిన కెసిఆర్, దేశ ప్రజల నమ్మకాన్ని కూడగడతాడా అంటూ ఈటల రాజేందర్ మండిపడ్డారు. దేశ ప్రజలు కేసీఆర్ ను ఒక బఫూన్ లా చూస్తున్నారని ఈటల పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయన్న ఈటల తెలంగాణలో చెల్లని రూపాయిగా ఉన్న కెసిఆర్ దేశంలో ఎలా చెల్లుబాటు అవుతాడు అంటూ ప్రశ్నించారు. కెసిఆర్ కు దేశ రాజకీయాలు చేసే సత్తా లేదని ఈటల రాజేందర్ తేల్చి చెప్పారు.

అవినీతికి మారుపేరు సీఎం కేసీఆర్
ధనిక రాష్ట్రమైన తెలంగాణలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని ఈటల రాజేందర్ విమర్శించారు. గురుకుల పాఠశాలలో పురుగుల అన్నం తిని విద్యార్థులు చనిపోతున్న పరిస్థితి ఉందని తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితిని ఈటల రాజేందర్ ప్రజలకు అర్థమయ్యేలా చెప్పారు. సీఎం కేసీఆర్ అవినీతికి మారుపేరని, కుటుంబ పాలనకు కూడా కెసిఆర్ మారుపేరని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.

హుజురాబాద్ తీర్పే మునుగోడులో రిపీట్ అవుతుంది
రాష్ట్రంలోని సర్పంచ్ లను బిల్లులు రావాలంటే టీఆర్ఎస్ పార్టీలో చేరాలని టిఆర్ఎస్ నాయకులు బెదిరిస్తున్నారని ఈటల రాజేందర్ మండిపడ్డారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చారో మునుగోడులో కూడా అదే తీర్పు పునరావృతం అవుతుందని ఈటల రాజేందర్ తేల్చిచెప్పారు. ఇక ఉపఎన్నికలు ఉంటేనే కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి బయటకు వస్తాడని లేకపోతే ఆయన ప్రజల్లోకి వచ్చేది ఉండదని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications