మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి అరెస్ట్...పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత; రీజన్ ఇదే!!
మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళిని భూపాలపల్లి పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీస్ స్టేషన్లో ఆయన ఆందోళన కొనసాగిస్తున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది.
తెలంగాణ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను టార్గెట్ చేస్తూ నిత్యం అనేక ప్రశ్నలను సంధిస్తూ, ప్రభుత్వ వైఖరి పై విమర్శలు గుప్పిస్తున్న మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళిని ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆకునూరు మురళిని అరెస్టు చేసిన పోలీసులు ఆయనను పోలీస్ స్టేషన్ కు తరలించగా పోలీస్ స్టేషన్లో బైఠాయించిన మురళి తన నిరసన తెలియజేస్తున్నారు. దీంతో భూపాలపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ కోసం ఆకునూరి మురళి పోరుబాట
అసలు ఇంతకీ ఆకునూరు మురళిని భూపాలపల్లి జిల్లా పోలీసులు ఎందుకు అరెస్టు చేశారు అంటే.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో గత ఐదు సంవత్సరాల క్రితం ఆకునూరి మురళి కలెక్టర్ గా ఉన్న సమయంలో 960 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించారు. అయితే అప్పటినుండి ఇప్పటివరకు ఆ ఇళ్ళను లబ్ధిదారులకు కేటాయించలేదు. నిరుపేదల కోసం ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను తక్షణం లబ్ధిదారులకు కేటాయించాలంటూ లబ్ధిదారులతో కలిసి మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి డబల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్దకు వెళ్లి ఆందోళన చేపట్టేందుకు ప్రయత్నం చేశారు.

పోలీసులు అరెస్ట్ చేసినా పోలీస్ స్టేషన్లోనూ మురళి ఆందోళన
అయితే ఆకునూరి మురళిని మార్గమధ్యంలోనే పోలీసులు అడ్డగించారు. పోలీసులతో వాగ్వాదం చేసిన మాజీ ఐఏఎస్ అధికారి మురళిని పోలీసులు అరెస్ట్ చేశారు. డబల్ బెడ్రూమ్ ఇల్లు లబ్ధిదారులకు కేటాయించేంతవరకు తాను విరమించేది లేదని తెలిసి చెప్పిన మురళి పోలీస్ స్టేషన్ లో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఆకునూరి మురళి కి మద్దతుగా డబల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారులు, మహిళలు వందల సంఖ్యలో పోలీస్ స్టేషన్ కు తరలి వెళ్లారు. ఇక పోలీస్ స్టేషన్లోకి వారంతా రాకుండా పోలీసులు స్టేషన్ గేట్లకు లాక్ చేసి వారిని అడ్డుకున్నారు. మరోవైపు ఆకునూరి మురళి లబ్ధిదారుల కోసం ఆందోళన కొనసాగిస్తున్నారు. దీంతో భూపాలపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు నిరుపేదలకు ఇవ్వాలని పోరాటం
అంతకు ముందు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అంతకుముందు కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇవ్వడం లేదని అనేకమార్లు ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. హన్మకొండలో ఒక్కదగ్గరే కట్టిన 592 డబుల్ బెడ్రూమ్ఇండ్లు ఇవ్వలేదని అంతకుముందు అసహనం వ్యక్తం చేశారు. కట్టి 5సంవత్సరాలు అయినా పేదలకు కేటాయించడం లేదు. పక్కనే వేలమంది కిరాయి ఇండ్లల్లో గుడిసెలల్లో ఘోరమైన పేదరికంతో బతుకుతున్నారన్నారు. సీఎం గారు ఈ ఇండ్లను పేదలకు వారం రోజులలో కేటాయించాలి. అసలు మీరు ఎందుకు 5సo నుండి ఇవ్వడం లేదు? చెప్పాలని ప్రశ్నించారు ఆకునూరి మురళి. ఇక భూపాలపల్లి లోనూ డబల్ బెడ్ రూమ్ ఇండ్ల విషయంలో లబ్ధిదారులతో కలిసి సంక్రాంతికి ముందు ఆందోళన చేశారు.
భూపాలపల్లి డబుల్ బెడ్ రూమ్స్ విషయంలో ఆందోళన ఉధృతం
భూపాలపల్లిలో 5 సంవత్సరాల క్రితం తాను కలెక్టర్ గా ఉన్నప్పుడు కట్టించిన 960 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇప్పటికి ఇంకా పేదలకు ఇవ్వలేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. 400 మంది లబ్దిదారులతో 5 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చారు. కలెక్టర్ సంక్రాంతికి ముందు డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పారని, సీఎం కేసీఆర్ దయచేసి ఇవ్వాలని అప్పుడు కూడా ఆకునూరి మురళి విజ్ఞప్తి చేశారు. ఇక తాజాగా మరో మారు భూపాలపల్లి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు లబ్ధిదారులకు ఇవ్వాలని ఆకునూరి మురళి పోరుబాట పట్టారు.












Click it and Unblock the Notifications