రాజ్యసభకు కవిత ఖాయం..! కేకే కొనసాగింపు డౌట్: రెండో సీటు ఆయనకేనా..!
తెలంగాణ అధికార పార్టీ నుండి పెద్దల సభకు వెళ్లే ఆ ఇద్దరు ఎవరు. ఏప్రిల్ లో రాజ్యసభలో తెలంగాణ నుండి రెండు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. ప్రస్తుతం పదవీ విరమణ చేస్తున్న ఆ ఇద్దరు తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు కాకపోయినా..రాష్ట్ర శాసనసభలో టీఆర్‌ఎస్ కు ఉన్న బలం కారణంగా..ఆ రెండు స్థానాలు అధికార పార్టీకే దక్కనున్నాయి. దీంతో..ఇప్పుడు ఆ రెండు స్థానాల్లో ఒకటి సీఎం కేసీఆర్ కుమార్తె మాజీ ఎంపీ కవితకు ఖాయమని తెలుస్తోంది. రెండో సీటు ఎవరికి ఇస్తారనే చర్చ మొదలైంది. పదవీ విరమణ చేస్తున్న కే కేశవ రావును కొనసాగిస్తారా లేదా అనే సందేహం మొదలైంది. ఇక వేళ కేశవ రావును కొనసాగించకపోతే ఎవరికిస్తారనే అంశం పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే పలువురు ఆశావాహులు..కేసీఆర్ సన్నిహితులు ఆ సీటు కోసం ఆశలు పెట్టుకున్నారు. అయితే, ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఆ విషయంలో ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.

రాజ్యసభకు కవిత ఖాయమేనా..!
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రాజ్యసభ లో త్వరలో ఖాళీ కానున్న రెండు స్థానాలు ఎవరికి దక్కుతాయనే చర్చ అధికార పార్టీలో మొదలైంది. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణకు 7, ఆంధ్రప్రదేశ్‌కు 11 రాజ్యసభ స్థానాలు కేటాయించారు. తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు రాష్ట్ర విభజన సమయంలో ఏపీ కోటాలోకి వెళ్లారు. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఈ ఏడాది ఏప్రిల్ 9న ఆరుగురు రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. అందులో రెండు తెలంగాణకు చెందినవి కాగా, 4 ఏపీకి చెందినవి. తెలంగాణ నుంచి గరికపాటి, కేవీపీ పదవీ విరమణ చేస్తారు. ఏపీ కోటాలో ఉన్న కేకే కూడా అదే రోజు పదవీ విరమణ చేయనున్నారు. తెలంగాణ నుంచి పదవీ విరమణ చేస్తున్న ఇద్దరూ టీఆర్‌ఎస్ కి చెందినవారు కాదు. కానీ, రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేల బలంతో ఆ రెండు స్థానాలూ టీఆర్‌ఎస్ కు దక్కనున్నాయి. అందులో ఒకటి మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కు దక్కటం ఖాయంగా కనిపిస్తోంది.

కేశవరావు కొనసాగింపుపై సందిగ్ధత..
సీనియర్ నేత కేశవరావు ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉంటారు. దీంతో..ఆయనకు మరో సారి రాజ్యసభకు రెన్యువల్ ఖాయమని ఆయన మద్దతు దారులు భావిస్తున్నారు. కానీ, పార్టీలో మారుతున్న సమీకరణా ల కారణంగా..ఆయనకు రాష్ట్రంలోనే ప్రభుత్వ పరంగా ఉన్నత స్థానం కల్పిస్తారని తెలుస్తోంది. సామాజిక సమీకరణాలు..భవిష్యత్ రాజకీయాలను పరిగణలోకి తీసుకొని నిర్ణయం ఉంటుందని చెబుతున్నారు. ఈ సమయంలో కవిత పేరు మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. ఢిల్లీ స్థాయిలో పార్టీ పరమైన వ్యవహారాలను గతంలో వినోద్‌కుమార్ చూసుకునే వారు. ప్రస్తుతం ఆయన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా రాష్ట్రానికే పరిమితయ్యారు. దీంతో కేసీఆర్‌కు నమ్మకంగా ఢిల్లీ స్థాయిలో పార్టీ, ప్రభుత్వ పనులు చక్కబెట్టేవారు లేకుండా పోయారని అంటున్నారు. ఈ నేపథ్యంలో లోక్‌సభ సభ్యురాలుగా పనిచేసి ఉండడం, ఢిల్లీలో ఉన్న పరిచయాలు కవితకు కలిసొచ్చే అంశాలుగా ఉన్నాయి. అయితే, కేశవరావుకు తగిన రీతిలో గుర్తింపు ఇచ్చే పదవి ఇచ్చి..ఆ తరువాతనే ఆయన స్థానంలో మరొకరిని ఎంపిక చేస్తారని చెబుతున్నారు.

రెండో సీటు ఆయనకే దక్కేనా..
టీఆర్‌ఎస్ నుండి రాజ్యసభ కు వెళ్లే రెండో వ్యక్తి పైన ఇప్పుడు భిన్న వాదనలు ఉన్నాయి. ప్రధానంగా రాజ్యసభ సీటు ఆశిస్తున్న వారిలో పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, కేఆర్ సురేశ్‌రెడ్డి, నాయిని నర్సింహారెడ్డి, సిరికొండ మధుసూదనాచారి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. టీఆర్‌ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక మంత్రి పదవి రెన్యువల్ కాకపోవడంతో నాయిని కొంత అసంతృప్తిగా ఉన్నారు. ఈక్రమంలో నాయినిని రాజ్యసభకు పంపించే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అలాగే నిరుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన మధుసూదనాచారి పేరు కూడా వినిపిస్తోంది. కాగా..పొంగులేటి శ్రీనివాస రెడ్డికి 2019
లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇవ్వలేదు. కొత్తగా టీడీపీ నుంచి నామా నాగేశ్వర్‌రావును చేర్చుకొని టికెట్ ఇచ్చారు. ఈనేపథ్యంలో పొంగులేటి.. రాజ్యసభ సీటుపై ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల తరువాత దీని పైన స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications