షిర్డీలో ఘోర ప్రమాదం: నలుగురు తెలంగాణ వాసుల మృతి
మహారాష్ట్రలోని షిర్డీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన నలుగురు మృతి చెందారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. షిర్డీకి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలో కొండగడప గ్రామానికి చెందిన కొందరు రెండు రోజుల క్రితం సాయి బాబా దర్శనం కోసం షిర్డీకి వెళ్లారు. దర్శనం పూర్తి చేసుకుని తిరిగి సొంతవూరుకు బయల్దేరారు. ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది.

ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. వారు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు.
మృతులను ప్రేమలత(59), వైద్విక్ నందన్ (6 నెలలు), అక్షిత (20), ప్రసన్నలక్ష్మి(45)గా గుర్తించారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. దైవ దర్శనం కోసం వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబంలో నలుగురు చనిపోవడంతో వారి కుటుంబంతోపాటు కొండగడప గ్రామంలోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి.












Click it and Unblock the Notifications