భార్యపై కోపంతో ఒకరు.. కొడుకు తాగుడు నచ్చక మరొకరు.. కొడుకులను హతమార్చిన తండ్రులు!!
సమాజంలో రోజు రోజుకి రక్త సంబంధాలకు అర్థం లేకుండా పోతుంది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రులే పిల్లల పాలిట యమకింకరులుగా మారుతున్నారు. అభంశుభం తెలియని పసి వాళ్ల ప్రాణాలు తీస్తున్న వారు కొందరైతే, తప్పుదారిన పడుతున్న పిల్లలను మార్చుకోలేక అసహనంతో ప్రాణాలు తీస్తున్న వారు మరికొందరు. తెలంగాణ రాష్ట్రంలో తాజాగా అత్యంత కర్కశంగా కన్న తండ్రులే పిల్లలను హతమార్చిన రెండు అమానుష ఘటనలు చోటుచేసుకున్నాయి.

భార్యపై కోపంతో ఒకరు.. కొడుకు తాగుడు నచ్చక మరొకరు హత్యలు
ఫుల్లుగా మద్యం తాగిన వ్యక్తి తాగిన మైకంలో భార్యతో గొడవపడి, అన్యం పుణ్యం తెలియని తన పసిబిడ్డను దారుణంగా తండ్రి కొట్టి చంపిన ఘటన మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలో చోటుచేసుకుంది. తాగి రోజూ గొడవ చేస్తున్న తన కుమారుడి తీరుతో తీవ్ర ఆగ్రహానికి గురైన తండ్రి రోకలిబండతో తలపై మోదడంతో కుమారుడు అక్కడికక్కడే మరణించాడు. ఇక ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. ఇక ఈ ఘటన వివరాల్లోకి వెళితే

మంచిర్యాల జిల్లాలో భార్యా భర్తల మధ్య గొడవ
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం లో ఇటుక బట్టీల్లో పనిచేసే నరేష్ దంపతులకు 11 నెలల శ్రీ కృష్ణ అనే కుమారుడున్నాడు. అయితే ఆదివారం నాడు భార్యాభర్తలిద్దరూ ఒక పెళ్ళికి వెళ్లి వివాహ వేడుకలో పాల్గొన్నారు. ఇక ఆ వివాహ వేడుకలో పీకల వరకు మద్యం తాగి డీజే డాన్స్ లతో ఎంజాయ్ చేసిన నరేష్, ఫుల్లుగా మద్యం తాగిన తర్వాత తన భార్యను భోజనం పెట్టమని అడిగాడు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

ఇటుక బట్టీలో కొడుకును కొట్టిన తండ్రి.. కొడుకు మృతి
ఇక మరుసటి రోజు కూడా భార్యాభర్తల మధ్య ఘర్షణ కొనసాగింది. ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న క్రమంలోనూ ఇద్దరూ గొడవకు దిగారు. దీంతో భార్యమీద కోపంతో భర్త పసికందు అని కూడా చూడకుండా తన 11 నెలల కొడుకు శ్రీకృష్ణను ఆవేశంలో ఇటుక బట్టీకేసి మూడు సార్లు కొట్టాడు. దీంతో పసికందు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన చూసిన స్థానికులు తీవ్ర భయాందోళనకు గురై వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే భర్త ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు చెబుతున్నారు. క్షణికావేశంలో అభం శుభం తెలియని పసికందు ప్రాణాలు తీసిన తండ్రిని పోలీసులు అరెస్ట్ చేసి కేసు విచారిస్తున్నారు.

సిరిసిల్ల జిల్లాలో తాగొస్తున్న కొడుకును రోకలి బండతో మోది చంపిన తండ్రి
ఇదిలా ఉంటే రాజన్న సిరిసిల్ల జిల్లా లోనూ కోనరావుపేట మండలం ధర్మారం గ్రామంలో నిఖిల్ అనే 22 సంవత్సరాల కొడుకును కన్న తండ్రి రోకలిబండతో మోది హతమార్చారు. ధర్మారం గ్రామానికి చెందిన గుర్రం బాలయ్య కుమారుడైన నిఖిల్ ప్రతి రోజూ మద్యం సేవించి వచ్చి తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేసినట్టు సమాచారం. ఇక ఈ నేపథ్యంలోనే కుమారుడి తీరుతో విసిగి పోయిన తండ్రి బాలయ్య నిఖిల్ తలపై రోకలిబండతో గట్టిగా కొట్టడంతో అక్కడికక్కడే నిఖిల్ మృతిచెందాడు.












Click it and Unblock the Notifications