తెలంగాణ ప్రజలారా! కాంగ్రెస్‌ను నమ్మిమోసపోవద్దు: కుమారస్వామి సంచలనం, కేసీఆర్‌పై ఇలా
బెంగళూరు: కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ అగ్రనేత కుమారస్వామి. తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ప్రజలు ఎవరూ నమ్మవద్దన్నారు. హస్తం పార్టీ ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతల మాటలు నమ్మొద్దని అన్నారు.
కర్ణాటక పథకాలనే తెలంగాణలోనూ అమలు చేస్తామంటున్నారని.. తమ రాష్ట్రంలో చేయలేని వారు తెలంగాణలో చేస్తామనడం విచిత్రంగా ఉందని కుమారస్వామి ఎద్దేవా చేశారు. కర్ణాటకలోని బెంగళూరులో జేడీఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన 5 గ్యారెంటీలు విఫలమయ్యాయని కుమార స్వామి ఆరోపించారు. రూ.లక్ష వరకు రుణాలు రద్దు చేస్తామన్నారని.. కానీ, చేయలేదని విమర్శించారు. గ్యారెంటీల పేరుతో దేశ వ్యాప్తంగా ఓట్లు కొల్లగొట్టేందుకు హస్తం పార్టీ కుట్ర పన్నిందని దుయ్యబట్టారు కుమారస్వామి.
తమ రాష్ట్రంలో ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని కుమారస్వామి మండిపడ్డారు. కర్ణాటక రాష్ట్రంలో సాగుకు 5 గంటల కరెంట్ కూడా ఇవ్వట్లేదని.. ఉచిత విద్యుత్ పేరుతో కాంగ్రెస్ పేదలను మోసం చేసిందని ధ్వజమెత్తారు. గృహజ్యోతి, యువనిధి పథకాలు అమలుకావట్లేదని అన్నారు. తెలంగాణలో రైతుబంధు విజయవంతంగా అమలవుతోందని కుమారస్వామి కితాబిచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎకరానికి రూ.15 వేలు రైతుబంధు ఇస్తామని మాయమాటలు చెబుతోందని విమర్శించారు.
కాగా, కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామంటూ ప్రజల్లోకి వెళుతున్న విషయం తెలిసిందే. తాము ఇచ్చిన హామీలను కర్ణాకటలో అమలు చేస్తామన్నామంటూ చెబుతున్నారు. అయితే, కర్ణాటకలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఇక్కడికి వచ్చి ఆరు గ్యారంటీలు అమలు చేస్తామంటూ ప్రచారం చేస్తుండటంపై బీఆర్ఎస్, బీజేపీలు మండిపడుతున్నాయి. తాజాగా, జేడీఎస్ నేత కుమారస్వామి విమర్శలు చేయడం గమనార్హం.












Click it and Unblock the Notifications