రేవంత్ రెడ్డి సీఎం కాకుండా జగన్ ప్రయత్నాలు ? పోలీసులకు కేవీపీ ఫిర్యాదు..!
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు రంగం సిద్దమవుతోంది. మరోవైపు ఇప్పటికే వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలన్నీ కాంగ్రెస్ దే ప్రభుత్వం అంటున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎవరు అవుతారనే ఉత్కంఠ కూడా పెరుగుతోంది. కాంగ్రెస్ పార్టీలో సీఎం పోస్టుకు అందరి కంటే ముందున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికే అవకాశం ఉంటుందని అంతా అనుకుంటున్న తరుణంలో వాట్సాప్ లో ఓ సందేశం చక్కర్లు కొడుతోంది.
దీని ప్రకారం ఏపీ సీఎం వైఎస్ జగన్ గతంలో తన తండ్రి వైఎస్సార్ ఆత్మగా చెప్పుకున్న కాంగ్రెస్ మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు సాయంతో రేవంత్ ను అడ్డుకునేందుకు స్కెచ్ వేశారనేది ఈ వాట్సాప్ సందేశాల సారాంశం. తెలంగాణ కాంగ్రెస్ లో వైఎస్సార్ అభిమానులైన ఎమ్మెల్యేలను తనవైపుకు తిప్పుకోవడం ద్వారా సీఎం కేసీఆర్ కు మద్దతుగా వారిని మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఈ వాట్సాప్ సందేశంలో ఉంది. దీంతో ఈ మెసేజ్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

అసలే ఏపీ సీఎం వైఎస్ జగన్ కు అండగా ఉండే తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారం కోల్పోయే పరిస్దితి రావడంతో నాగార్జున సాగర్ డ్యామ్ పైకి పోలీసులను పంపారని కూడా ఈ మెసేజ్ లో ఉంది. దీంతో ఈ మెసేజ్ పై కాంగ్రెస్ మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ఇవాళ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మెసేజ్ కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరారెడ్డి ద్వారా తనకు అందినట్లు కేవీపీ పేర్కొన్నారు. తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా ఉన్న ఈ వాట్సాప్ మెసేజ్ లు వైరల్ కాకుండా ఆపాలని ఆయన పోలీసుల్ని కోరారు.












Click it and Unblock the Notifications