నా వల్లే రూ. 450 కోట్ల నిధులు మిగిలాయి! కార్ రేసింగ్‌పై రేవంత్ సంచలనం
కేసీఆర్ ప్రభుత్వ హాయంలో జరిగిన ఫార్ములా ఈ కార్ రేసింగ్ గురించిన సంచలన విషయాలు వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి. శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ.. ఫార్ములా ఈ కార్ రేసింగ్‌పై సభలో చర్చించాలని కేటీఆర్ ఇంతకాలం ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. ఈ కార్ రేస్ ప్రతినిధులు వచ్చి తనను కలిశారని చెప్పారు.
రూ. 600 కోట్లు పెండింగ్ నిధులు రావాల్సి ఉందని.. వాటిని ఇవ్వాలని అడిగారని సీఎం రేవంత్ చెప్పారు. మీరు గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. మరోసారి రేసింగ్ నిర్వహిస్తామని రేసింగ్ ప్రతినిధులు తనతో చెప్పారని తెలిపారు. ఎఫ్ఈవో ప్రతినిధులు వచ్చి కలిసిన తర్వాతే ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిందని సీఎం రేవంత్ వెల్లడించారు.

హెచ్ఎండీఏ ఖాతాలోని రూ. కోట్ల నిధులు లండన్‌లోని కంపెనీకి నేరుగా ఎలా వెళ్తాయని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కార్ రేసింగ్ నిర్వాహకులతో కేటీఆర్ కుదుర్చుకున్న ఒప్పందం రూ. 600 కోట్ల విలువైనదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మిగితా డబ్బు కోసం వాళ్లు వచ్చినప్పుడే తనకు ఈ విషయం తెలిసిందన్నారు.
ఓఆర్ఆర్ అమ్మినా.. హెచ్ఎండీఏ నిధులు కాజేసినా.. ఆడగవద్దన్నట్లుగా మాట్లాడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ సభ్యులపై మండిపడ్డారు. తాను జాగ్రత్త పడటం వల్లే రూ. 450 కోట్లు మిగిలాయని తెలిపారు. అంతేగాక, రేసింగ్ వ్యవహారంలో చెల్లించిన రూ. 55 కోట్లు చిన్న విషయం కాదని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు.
ఈ కార్ రేసింగ్ వ్యవహారంపై ఏసీబీ విచారణ జరుగుతోందని చెప్పారు. హైకోర్టులో కేటీఆర్ వేసిన పిటిషన్‌పై విచారణ జరుగుతోంది కాబట్టే.. ఎక్కువ వివరాలు వెల్లడించలేనని సీఎం రేవంత్ చెప్పారు. న్యాయపరంగా చిక్కులు లేకపోతే ఈ వ్యవహారంపై ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు తాను సిద్దమేనని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. అవసరమైతే బీఆర్ఎస్ కార్యాలయానికి వెళ్లైనా చర్చిస్తానని తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications