రేప్, యువతి హత్య: తోటి విద్యార్థిపై యాసిడ్ దాడి
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదు పాతబస్తీలోని పహడీషరీఫ్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. అలీనగర్‌లో శనివారంనాడు ఉదయం ఓ యువతి మృతదేహం లభ్యమైంది. యువతిపై దుండగులు అత్యాచారం చేసి, ఆ తర్వాత హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇదిలావుంటే, హైదరాబాద్ నగరంలోని పీర్జాదిగూడ ఎస్‌ఆర్ కళాశాలలో దారుణం జరిగింది. ఓ విద్యార్థిపై తోటి విద్యార్థి యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. విద్యార్థి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు విద్యార్థుల మధ్య చిన్న గొడవ కాస్తా పెద్ద ఘర్షణకు దారి తీయడంతో సహనం కోల్పోయిన ఓ విద్యార్థి సహ విద్యార్థిపై యాసిడ్‌తో దాడి చేశాడు.

ఈ వ్యవహారంపై కళాశాల యాజమాన్యం గుట్టుచప్పుడు కాకుండా వ్యవహరించేందుకు సిద్ధపడింది. శనివారంనాడు విషయం బయటపడటంతో బాధితుడి తల్లిదండ్రులు, విద్యాసంఘాలు కాలేజీ ఎదుట ఆందోళనకు దిగారు. బాధిత విద్యార్థిని ఆదుకోవడంతో పాటు దాడికి పాల్పడిన విద్యార్థిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పేలిన గ్యాస్ సిలిండర్
హైదరాబాద్ కూకట్‌పల్లిలోని ప్రశాంత్ నగర్‌లో శనివారంనాడు జిఎస్ హైడ్రాలిక్ కంపెనీలో శనివారం ఉదయం ప్రమాదవశాత్తూ గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం రెమిడీ ఆస్పత్రికి తరలించారు. గాయపడినవారిని సత్యనారాయణ, మల్లారెడ్డి, శంషుద్దీన్‌లుగా గుర్తించారు. వారిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం.
పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు సాగిస్తున్నారు. హైడ్రాలిక్ కంపెనీకి అనుమతులున్నాయా లేదా అనే విషయంపై కూడా వారు దృష్టి పెట్టారు. ప్రమాదానికి గల కారణం ఏమిటని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications