శుభవార్త: మహిళల ఖాతాల్లో త్వరలోనే డబ్బులు జమ!
తెలంగాణ రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ మహిళలకు శుభవార్త చెప్పింది. త్వరలోనే మహిళా సంఘాలలోని మహిళల బ్యాంకు ఖాతాలలో డబ్బులు జమ చేయడానికి రెడీ అయింది. గతంలో మహిళలు అభయ హస్తం పథకం కింద జమ చేసుకున్న నిధులను మళ్లీ వారికే తిరిగి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా త్వరలోనే ఆ డబ్బులు మహిళల బ్యాంకు ఖాతాలలో జమ చేయబడతాయి.
అభయ హస్తం పథకంలో మహిళల పొదుపు
గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2009 నుంచి అభయహస్తం పథకంలో భాగంగా మహిళలు ప్రతిరోజు ఒక రూపాయి చొప్పున ఆరేళ్ల పాటు చెల్లించారు. ఈ పథకంలో డ్వాక్రా సంఘాలలోని మహిళలు డబ్బు పొదుపు చేసుకున్నారు. అయితే ఆ తర్వాత అది ఆగిపోయింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఈ పథకం కొనసాగలేదు.

గ్రామాల వారీగా లబ్దిదారుల జాబితా
ఈ క్రమంలో 2009 నుంచి 2016 వరకు డ్వాక్రా గ్రూపుల సభ్యులు జమ చేసుకున్న డబ్బులు వారికి మళ్లీ తిరిగి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొని గ్రామాల వారీగా లబ్ధిదారుల లిస్టును రెడీ చేసింది. ఇక అధికారులు గ్రామాల వారిగా లిస్టును సిద్ధం చేసి ప్రభుత్వానికి అందించనుండగా త్వరలోనే మహిళల ఖాతాలలో ఆ సొమ్ము జమ అవుతుంది.
ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వ పథకం..
ఇదిలా ఉంటే రాష్ట్రంలో 60 ఏళ్లు దాటిన మహిళలకు ప్రతినెల 500 రూపాయల పెన్షన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో అభయహస్తం పథకాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది. అయితే మహిళా సంఘాలలోని మహిళలు ఏడాదికి 365రూపాయలు చొప్పున దీనికోసం ప్రీమియం చెల్లించారు. 2018సంవత్సరంలో ఈ పథకం ఆగిపోయింది.
వడ్డీతో కలిపి ఆ నిధులను తిరిగి మహిళల ఖాతాల్లో జమ చేయనున్న రేవంత్ సర్కార్
ఈ పథకంలో మహిళలు పొదుపు చేసుకున్న నిధులను గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఇతర అవసరాలకు వినియోగించినట్లు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది. మొత్తం మహిళలు 385 కోట్ల రూపాయలు జమ చేయగా 2022 నాటికి ఆ డబ్బులు వడ్డీతో కలిపి 545 కోట్ల రూపాయలకు చేరుకున్నట్టు తెలిసింది. దీంతో ఈ నిధులను తిరిగి మహిళల బ్యాంకుల ఖాతాలలో జమ చేయాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సమాచారం.
మహిళలకు శుభవార్త చెప్పనున్న రేవంత్ సర్కార్
ఇక దీనికోసమే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల వారీగా లిస్టులు తయారు చేస్తున్నారు. త్వరలోనే ఈ డబ్బులు రేవంత్ ప్రభుత్వం మహిళల ఖాతాలలో వేసి వారికి శుభవార్త చెప్పబోతోంది. పొదుపు చేసుకున్న మహిళలు కూడా ఈ డబ్బుల గురించి మరచిపోయిన వేళ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ డబ్బు మళ్ళీ వాళ్ళ ఖాతాలకు చేర్చే ఆలోచన చెయ్యటం పట్ల హర్షం వ్యక్తం అవుతుంది .












Click it and Unblock the Notifications