తెలంగాణా యువతకు శుభవార్త.. మొదలైన అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ, వారికి హెచ్చరిక!
తెలంగాణ రాష్ట్రంలోని యువతకు శుభవార్త. ఇండియన్ ఆర్మీలో పనిచేయాలని కలలుకనే యువతకు అగ్ని వీర్ రిక్రూట్మెంట్ ర్యాలీతో కేంద్రం శుభవార్త చెప్పింది. ప్రస్తుతం ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ నేడు ప్రారంభమైంది. హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అగ్ని వీర్ రిక్రూట్మెంట్ ర్యాలీని ఈరోజు ఉదయం జెండా ఊపి ప్రారంభించారు.
33 జిల్లాల నుండి సుమారు 8వేల మంది అభ్యర్థులు
ఆర్మీ చెన్నై జోన్, సికింద్రాబాద్ రిక్రూట్మెంట్ ఆఫీసర్ సమన్వయంతో నేటి నుండి 22వ తేదీ వరకు ఈ ఎంపిక నిర్వహించనున్నారు. హన్మకొండ లోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో కొనసాగుతున్న ఈ ర్యాలీలో 33 జిల్లాల నుండి సుమారు 8 వేల మంది అభ్యర్థులు హాజరయ్యే అవకాశం ఉండడంతో ఒక్కో రోజు రెండు, మూడు జిల్లాల అభ్యర్థులకు సెలక్షన్స్ నిర్వహించనున్నారు.

800 మందికి ఫిజికల్ మరియు మెడికల్ టెస్ట్ లు
నేడు ఆదిలాబాద్, వనపర్తి జిల్లాకు చెందిన అభ్యర్థులకు టెస్టులు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు 800 మందికి ఫిజికల్ మరియు మెడికల్ టెస్ట్ లు నిర్వహించనున్నారు. అగ్నివీర్ నియామక ప్రక్రియలో ప్రతిరోజు ఎనిమిది వందల మంది చొప్పున 7956 మెడికల్ టెస్టులు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఈరోజు తెల్లవారుజామున నాలుగు గంటల నుండి ప్రారంభమైన ఈ ర్యాలీలో ఫిజికల్ ఫిట్నెస్ టెస్టులు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించారు.
ప్రతీరోజు టెస్టులు .. సర్టిఫికెట్ వెరిఫికేషన్
తెల్లవారుజామున 4, 5గంటల నుండి రన్నింగ్, లాంగ్ జంప్, చెస్ట్, జిగ్జాగ్, చిన్ అప్స్ అండ్ బీమ్స్, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ లు నిర్వహించనున్నారు. నియామక ప్రక్రియ నిర్వహించే ముందు ప్రతి 800 మందికి సంబంధించిన సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. దీంతో అర్థరాత్రి 12 గంటలు దాటిన తర్వాత రిక్రూట్మెంట్ సైట్ ఓపెన్ కాగానే ప్రాసెస్ చేసేలా చర్యలను కూడా చేపట్టారు.

అభ్యర్థులకు కీలక సూచన
అగ్నివీర్ ఎంపిక ప్రక్రియ పూర్తయ్యే వరకు హన్మకొండ జేఎన్ఎస్ గ్రౌండ్ లోకి అర్హులైన అభ్యర్థులు తప్పించి ఇతరులు వెళ్లకుండా చర్యలు చేపట్టారు. మొత్తం 200 మంది పోలీసులు ఇక్కడ విధులను నిర్వర్తిస్తున్నారు. హన్మకొండ బస్టాండ్ తో పాటు స్టేడియం బయట, లోపల పోలీసులు డ్యూటీలు చేస్తున్నారు. ముఖ్యంగా అభ్యర్థులు ఎవరు ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా చెప్తే నమ్మవద్దని అలా ఎవరు మోసపోవద్దని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ అటువంటివారు తారసపడితే వెంటనే డయల్ 100 కు కాల్ చేసే సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications