విద్యార్థులకు శుభవార్త: ఇకపై వారికి స్నాక్స్!
ప్రభుత్వ పాఠశాలలలో చదువుకునే విద్యార్థులకు శుభవార్త. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో 10 లక్షల మంది పదోతరగతి విద్యార్థులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం శుభవార్త అందించింది. త్వరలో జరగనున్న పదవ తరగతి పరీక్షల దృష్ట్యా విద్యార్థుల పైన ఒత్తిడి తగ్గించి వారి చదువుకు తోడ్పడడానికి కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా విద్యార్థులకు బంగారు భవిష్యత్తును ఇవ్వాలని భావిస్తున్న తెలంగాణ సర్కార్ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తోంది.
విద్యార్థులకు సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు
ఇందులో భాగంగానే రేవంత్ రెడ్డి సర్కార్ పదవ తరగతి విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేసేందుకు సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులను నిర్వహిస్తోంది. ఈ ప్రత్యేక తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు ఉచిత పౌష్టిక అల్పాహారం అందించాలని ప్రభుత్వం సంకల్పించింది. దీనికోసం తెలంగాణ పాఠశాల విద్యాశాఖ 4.23 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులను జారీ చేశారు.

పాఠశాలలకు ఈవినింగ్ స్నాక్స్ పంపిణీ
ముఖ్యంగా పదో తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం ఫిబ్రవరి 16వ తేదీ నుండి మార్చి 10వ తేదీ వరకు మొత్తం 19 రోజులపాటు, ఆయా పాఠశాలలకు ఈవినింగ్ స్నాక్స్ పంపిణీ చేయబడతాయి. అదనపు గంటలు చదువుకునే విద్యార్థులలో ఉత్సాహాన్ని నింపడంతో పాటు, వారి ఆరోగ్యాన్ని పరిగణనలోకి తీసుకొని, పౌష్టికాహారం అందించడం కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
అల్పాహారం ఇస్తూ ప్రభుత్వ నిర్ణయం
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలలోనూ, మోడల్ స్కూల్స్ లోను పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు అందరికీ సాయంత్రం అల్పాహారం అందుబాటులో ఉంటుంది. ఇది విద్యార్థుల ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. పరీక్షలకు మరింత మెరుగ్గా సన్నద్ధం అయ్యేందుకు సహాయపడుతుందని అధికారులు చెబుతున్నారు. కాగా 2026 తెలంగాణ రాష్ట్ర పదోతరగతి పరీక్షల షెడ్యూల్ ఇప్పటికే వచ్చింది.
పదో తరగతి విద్యార్థుల కోసం మంచి నిర్ణయం
మార్చి 14వ తేదీ నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు పదోతరగతి పరీక్షలు ప్రతిరోజు ఉదయం 9 గంటల 30 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల యాభై నిమిషాల వరకు నిర్వహించబడతాయి. విద్యార్థుల జీవితంలో అత్యంత ముఖ్యమైన పదో తరగతి పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయడానికి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సాయంత్రం స్టడీ అవర్స్ నిర్వహించడం, వారికి స్నాక్స్ అందించాలని నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషదాయకం.












Click it and Unblock the Notifications