శుభవార్త.. ఇకపై రైల్వేస్టేషన్లలో తెలంగాణా ఉత్పత్తులు, వారికి పండుగే!
తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ముఖ్యంగా స్వయం సహాయక సంఘాలలో పనిచేస్తున్న మహిళలకు ఊతమిచ్చేందుకు సిద్ధమైంది. స్వయం సహాయక బృందాలలో ఉండే మహిళలు ఉపాధి పొందే లాగా సరికొత్త నిర్ణయాన్ని తీసుకుంది. త్వరలో రానున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం కానుకగా మహిళలకు శుభవార్త చెప్పింది తెలంగాణ ప్రభుత్వం.
తెలంగాణా మహిళలకు శుభవార్త
తెలంగాణ రాష్ట్రంలోని రైల్వే స్టేషన్లలో మహిళా స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు సంబంధించిన స్టాల్స్ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. మొదటి విడతలో 14మహిళా స్టాల్స్ ను, రెండవ విడతలో 36మహిళా స్టాళ్లను ప్రారంభించాలని రాష్ట్రప్రభుత్వం ఒక ప్రణాళికను రూపొందించింది. తెలంగాణ రాష్ట్రంలో మహిళా స్వయం సహాయక సంఘాలకు ఉపాధి కల్పించడం కోసం సచివాలయం, కలెక్టరేట్లు, పర్యాటక ప్రాంతాలలో మహిళా ఉత్పత్తుల స్టాల్స్ ను ఏర్పాటు చేసి కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.

రైల్వే స్టేషన్ లలో మహిళా స్టాల్స్ ఏర్పాటుకు మంత్రి సీతక్క ఆదేశం
తాజాగా రైల్వే స్టేషన్లలో కూడా వీటిని ఏర్పాటు చేసి రైలు ప్రయాణికులకు తెలంగాణ ఇంటి వంటలు రుచి చూపించాలని, మహిళల ద్వారా తయారవుతున్న అనేక చేనేత ఉత్పత్తులను కూడా అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఈ మేరకు స్టాల్స్ ను ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టాలని రాష్ట్ర మంత్రి సీతక్క అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
తెలంగాణాలో ఈ రైల్వే స్టేషన్ లలో స్టాల్స్
రైల్వే శాఖ అధికారులతో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సీఈవో దివ్య దేవరాజన్ సంప్రదింపులు జరిపారు. రైల్వే శాఖ అధికారులు కూడా అనుమతి ఇవ్వడంతో ప్రాథమికంగా త్వరలో కొన్ని స్టేషన్లో వీటిని ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్ లో పిండి వంటల ఉత్పత్తులను స్టాల్స్ పెట్టనున్నారు. ఖమ్మంలోనూ, సిర్పూర్ లోను పిండి వంటల ఉత్పత్తులు, భద్రాచలంలో పచ్చళ్ళు, వరంగల్లో చిరుధాన్యాలు, కరీంనగర్ లో చిరుధాన్యాల ఉత్పత్తులు, ఘనపూర్లో చేతి ఉత్పత్తుల స్టాల్స్ పెట్టనున్నారు.
తెలంగాణా ఉత్పత్తుల ఖ్యాతి దేశానికి తెలిసేలా ప్లాన్
శంకర్పల్లి లో జూట్, క్లాత్ బ్యాగ్ లు, చర్లపల్లి లో మట్టి కప్పులు, నీళ్ల సీసాలు, కడాయిలు వంటి ఉత్పత్తులు జనగామలో టవల్స్, చేతిరుమాళ్ళు, పోచంపల్లిలో చేనేత ఉత్పత్తులు, వికారాబాద్ లో గాజులు, పూసలు, హారాల ఉత్పత్తులు స్టాల్స్ పెట్టనున్నారు. ఇక ఈ స్టాల్స్ ద్వారా రైలు ప్రయాణికులకు వీటిని అందించగలడం మాత్రమే కాకుండా తెలంగాణ ఉత్పత్తుల యొక్క ఖ్యాతి దేశ ప్రజలు అందరికీ తెలిసే అవకాశం ఉంటుంది.
మహిళలకు స్వయం ఉపాధి
వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడ మహిళా సంఘాల ఉత్పత్తులకు ఆర్డర్లు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. తద్వారా మహిళల ఆదాయం కూడా పెరుగుతుందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఏది ఏమైనా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభవార్త చెప్పనున్న తెలంగాణ ప్రభుత్వం రైల్వే స్టేషన్లో తెలంగాణ ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చి అండగా ఉండాలని నిర్ణయించింది.












Click it and Unblock the Notifications