హైదరాబాదీలకు శుభవార్త.. ఆ మార్గాల్లో మెట్రో రైలు!
హైదరాబాద్ వాసులకు మరో శుభవార్త. దశాబ్దానికి పైగా కొనసాగుతున్న పాతబస్తీ మెట్రో కల ఇప్పుడు నెరవేరే దిశగా అడుగులు పడుతున్నాయి. హైదరాబాద్లో ట్రాఫిక్ కు చెక్ పెట్టేలా హైదరాబాద్ ఓల్డ్ సిటీ మెట్రో రైల్ కారిడార్ నిర్మాణానికి సంబంధించి సన్నాహక పనులు కీలక దశకు చేరుకుంటున్నాయి. ఇక ఈ విషయాన్ని హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ లిమిటెడ్ ఎన్ వి ఎస్ రెడ్డి పేర్కొన్నారు.
పాతబస్తీ మెట్రో రైలు పనుల పురోగతి
మాస్టర్ ప్లాన్ ప్రకారం 100అడుగులకు రోడ్డు విస్తరణ జరుగుతోందని, ఇందులో భాగంగా ప్రభావిత ఆస్తుల కూల్చివేత కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు. మెట్రో రైలు పనులు శరవేగంగా ప్రారంభించడానికి కావలసిన రైట్ ఆఫ్ వే ప్రక్రియ పురోగతిలో ఉందని ఆయన వెల్లడించారు.మెట్రో స్తంభాల నిర్మాణానికి అవసరమైన స్థలంతో పాటుగా ఇరువైపులా రెండు లైన్ల రోడ్ విస్తరణకు కొంత ప్రాంతాన్ని కేటాయించారు. ఈ ప్రాంతాన్ని రైట్ ఆఫ్ వే అంటారు.

మెట్రో పనులకు ఈ ఇబ్బందులు
ప్రస్తుతం మెట్రో స్తంభాలు, స్టేషన్ల నిర్మాణానికి సంబంధించి సన్నాహక పనులను వేగవంతం చేస్తున్నారు. ఈ పాతబస్తీ మార్గం చాలా పురాతనమైనది కావడంతో రోడ్డు కింద భాగంలో మురుగునీరు, తాగునీరు, వరదనీటి పైప్లైన్లు, టెలికాం, విద్యుత్ లైన్లు వంటివి ఉన్నాయి. వీటిని గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ సర్వే ద్వారా గుర్తిస్తున్నారు. మెట్రో స్తంభాలు వచ్చే ప్రదేశంలో భూగర్భంలో ఉన్న వాటిని వేరే చోటికి మార్చడం చాలా ముఖ్యమైన పని అని చెబుతున్నారు.
కొనసాగుతున్న నిర్మాణాల కూల్చివేత పనులు
ఇక పాత బస్తి మెట్రో కారిడార్ 7.5 కిలోమీటర్ల దూరం విస్తరించి ఉందని ఇక్కడ దాదాపు ఈ ప్రాజెక్టు వల్ల 1100 ఆస్తులు ప్రభావితం అవుతున్నాయని చెబుతున్నారు. అయితే ఇప్పటికే 550 నిర్మాణాలను కూల్చి వేయగా, ప్రభావిత ఆస్తుల యజమానులకు 443 కోట్ల రూపాయలను పరిహారంగా ఇచ్చారు. ప్రతి 100 మీటర్లకు ఒక మైలురాయిని ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఇంజనీరింగ్ పరిష్కారాల కోసం 886 ఆస్తులను సేకరిస్తున్నారు.
గతంలో అలైన్మెంట్ వివాదాల కారణంగా నిలిచిన ప్రాజెక్టు
గతంలో ఎంజీబీఎస్ నుండి ఫలక్ నుమా వరకు అలైన్మెంట్ వివాదాల కారణంగా ఈ ప్రాజెక్టు నిలిచిపోయింది .అయితే ప్రస్తుతం పనులలో వేగం పుంజుకోవడంతో రెండు సంవత్సరాలలో పాతబస్తీ ప్రాంతంలో మెట్రో రైళ్ళు తిరుగుతాయని అంచనా వేస్తున్నారు. ప్రస్తుత ప్రతిపాదన ప్రకారం ఎంజీబీఎస్ నుండి చాంద్రాయణగుట్ట వరకు మెట్రో విస్తరణ జరుగుతుంది.
పాతబస్తీ మెట్రో రైల్ కారిడార్ పనులలో కీలక అడుగులు
పాతబస్తీలో మిగిలిన మార్గాన్ని రెండవ దశలో చేర్చి అనుమతి కోసం కేంద్ర ప్రభుత్వానికి సమర్పించారు. ప్రస్తుతం ఇది పరిశీలనలో ఉంది. ఏది ఏమైనా రకరకాల సమస్యలను అధిగమించి పాతబస్తీ మెట్రో కారిడార్ పనులలో కీలక అడుగులు పడుతున్నాయి. ఇక ఇదే విషయాన్ని హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ లిమిటెడ్ ఎన్ వి ఎస్ రెడ్డి వెల్లడించారు.












Click it and Unblock the Notifications