ప్రైవేట్ దోపిడీకి చెక్ ... తెలంగాణా ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా చికిత్సల గరిష్ట ధరల జీవో జారీ చేసిన సర్కార్
కరోనా మహమ్మారి కారణంగా ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్న తర్వాత,కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి సమయంలో ప్రైవేట్ ఆసుపత్రులు ఇష్టారాజ్యంగా దోపిడి చేసిన తర్వాత, ఆస్తులు అమ్ముకొని ఇళ్ళు ఒళ్ళు గుల్ల చేసుకొని ఆసుపత్రుల్లో డబ్బులు చెల్లించి కరోనా బాధిత కుటుంబాలు కంటికి కడివెడు ఏడ్చిన తరువాత ఫైనల్ గా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కళ్లు తెరిచింది.

వెంటిలేటర్ తో కూడిన ఐసియు గదికి రోజుకు 9 వేల రూపాయల గరిష్ట ధర
రాష్ట్రంలో ప్రైవేటు ఆసుపత్రులలో కరోనా చికిత్సల, పరీక్షల గరిష్ట ధరలను తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసింది. కరోనా చికిత్సల చార్జీలపై వైద్యారోగ్యశాఖ జీవో 40 ని జారీ చేసింది. వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన జీవో ప్రకారం ప్రైవేట్ ఆసుపత్రుల్లో ప్రభుత్వం ఖరారు చేసిన ధరల వివరాలు చూస్తే సాధారణ వార్డులో ఐసోలేషన్, పరీక్షలకు రోజుకు గరిష్టంగా నాలుగు వేల రూపాయలు మాత్రమే తీసుకోవాలి. ఐసియు గదిలో రోజుకు గరిష్టంగా 7500 రూపాయలు, వెంటిలేటర్ తో కూడిన ఐసియు గదిలో రోజుకు 9 వేల రూపాయలకు మించి చార్జ్ చేయకూడదు.

పరీక్షల ధరలను సైతం వెల్లడించిన సర్కార్
ఇక పిపిఈ కిట్ కు 273 రూపాయలు, హెచ్ ఆర్ సిటి స్కాన్ కు 1995 రూపాయలు, డిజిటల్ ఎక్స్ రే కు 1300 రూపాయలు, ప్రొకాల్ సితోసిన్ కు 1,400 రూపాయలు, ఐఎల్ 6 కు 1300 రూపాయలు, డీ డైమర్ కు 300 రూపాయలు, సి ఆర్ పి 500 రూపాయలు, ఫెరిటీన్ 400 రూపాయలు , ఎల్ డి హెచ్ కు 140 రూపాయలకు మించి ఛార్జ్ చేయకూడదు. అదేవిధంగా ఆక్సిజన్ సౌకర్యం ఉన్న అంబులెన్స్ కు కిలోమీటరుకు 75 రూపాయల చొప్పున నిర్ణయించారు. ఇక మినిమమ్ ఛార్జ్ 2000 రూపాయలు గా పేర్కొన్నారు.

అంబులెన్సుల చార్జీలు ఇలా
అధునాతన వెంటిలేటర్ సౌకర్యం ఉన్న అంబులెన్స్ కు కిలోమీటర్ కు 125 రూపాయల చొప్పున , మినిమమ్ ఛార్జ్ మూడు వేల రూపాయల చొప్పున నిర్ణయించారు. ఈ ధరలను మించి ప్రైవేట్ ఆసుపత్రులలో రోగుల వద్ద నుండి వసూలు చేయడానికి వీలు లేదని తెలంగాణ సర్కార్ జీవో జారీ చేసింది. ఈ జీవోను అతిక్రమించి ఎవరైనా అధిక ఫీజుల వసూళ్లకు పాల్పడితే వారిపై చర్యలు తీసుకోవడానికి వెనకాడబోమని తేల్చి చెబుతోంది.
Recommended Video

ఇప్పటికైనా ప్రైవేట్ దోపిడీకి చెక్ పడుతుందా ?
మరి ఇంత కాలం లక్షలకు లక్షలు దోపిడీ చేసిన ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రభుత్వం తాజా నిర్ణయంతోనైనా తమ వైఖరి మార్చుకుంటాయా.. లేక అదే విధంగా అడ్డగోలు దోపిడీకి తెగబడతాయా అనేది తెలియాల్సి ఉంది. అంతేకాదు ప్రభుత్వం ఖరారు చేసిన ధరలపై ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు ఏమంటారో కూడా తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications