'లింబయ్య ఆత్మహత్యపై ప్రభుత్వం ఎత్తుగడ!', కెసిఆర్‌ను తిట్టడంతో పాటు: విహెచ్
ఢిల్లీ/హైదరాబాద్: రాష్ట్ర రాజధాని భాగ్యనగరంలో నడి బొడ్డున ఆత్మహత్య చేసుకున్న లింబయ్య... అనారోగ్య కారణాలతో చనిపోయాడని వక్రీకరించడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎత్తుగడగా సిపిఐ సీనియర్ నేత నారాయణ ఆదివారం అభివర్ణించారు.
రైతుల ఆత్మహత్యలను వక్రీకరించవద్దని ఆయన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వాలకు హితవు పలికారు. లింబయ్య ఆత్మహత్య పైన ప్రభుత్వం వక్రీకరిస్తుందన్నారు. అన్నదాతల ఆత్మహత్యలను సర్కారీ హత్యలుగా నమోదు చేసి తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు సహా ప్రధాని నరేంద్ర మోడీని కూడా ముద్దాయిలుగా చేర్చాలన్నారు.
ప్రత్యేక హోదా పైన శాసన సభలో తీర్మానం చేసి చేతులు దులుపుకోవడం ఏపీ నేతలకు సరికాదన్నారు. తెలంగాణకు ప్యాకేజీ, ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విధంగా ప్రదాని మోడీ పైన ఒత్తిడి తేవాలన్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆ దిశలో ప్రయత్నం చేయాలన్నారు.

ఆత్మహత్యల పాపం ప్రభుత్వాలదే: విహెచ్
రైతుల ఆత్మహత్యల పైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు స్పందించారు. ఆ పాపం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలదే అన్నారు. కేంద్రం భూసేకరణ చట్టం పేరిట రైతులకు నష్టం చేసే ప్రయత్నాల్లో ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలను పట్టించుకోవడం లేదన్నారు.
కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు నోట రైతుల మాటే రావడం లేదని విమర్శించారు. రైతుల సమస్యల పరిష్కారానికి ఇంత వరకు తెలంగాణ ప్రభుత్వం ఒక్క నిర్ణయం తీసుకోలేదన్నారు. కాంగ్రెస్ నేతలు కెసిఆర్‌ను తిట్టడంతో సరిపెట్టకుండా రైతులకు తమవంతు ఆర్థిక సాయం అందించాలని సూచించారు.
తాను తెలంగాణలో నిర్వహించిన ఆందోళనలలో కొందరు నేతలు పాల్గొనలేదని, వారి వివరాలను తెలంగాణ పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డికి అందించానని వి హనుమంత రావు చెప్పారు.
ప్రాజెక్టుల రీడిజైన్ ఆలోచనను ప్రభుత్వం మానుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం రైతులకు రుణమాఫీ ఒకే దఫాలో చేయాలని, అప్పుడు రైతుల ఆత్మహత్యలను తగ్గించవచ్చునని జానా రెడ్డి సూచించారు.












Click it and Unblock the Notifications