ప్రచారాల్లో దుమ్ము రేపుతూ.. టాప్ లో "గులాబీల జెండలే రామక్క" పాట!!
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో ఓటర్ల మనసు గెలుచుకోవడానికి నానా అగచాట్లు పడుతున్నారు. ఇక ప్రచారాలలో పాటలకు ఉండే స్థానమే వేరు. అభ్యర్థుల పేరుతో ప్రతి నియోజకవర్గంలో లెక్కకు మిక్కిలిగా పాటలు మైకుల ద్వారా నియోజకవర్గ వ్యాప్తంగా ప్రచారం అవుతున్నాయి.
ఎక్కడ చూడు ఎన్నికల కోలాహలం కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. పార్టీ జెండాలు వాడ వాడలా రెపరెపలాడుతున్నాయి. ఇక ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్న వారి హడావుడి అంతా ఇంతా కాదు. అయితే ఈసారి తెలంగాణ ఎన్నికలకు తయారుచేసిన పాటలలో టాప్ ట్రెండింగ్ లో నిలిచింది గులాబీల జెండలే రామక్క ... గురుతుల గుర్తుంచుకో రామక్క అంటూ సాగిన పాట.

తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు ఆ తర్వాత కేసీఆర్ నేతృత్వంలో పదేళ్లలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను పాట రూపంలో కళ్లకు కట్టినట్టు చూపించే 'గులాబీల జెండలే రామక్క' అనే పాటను బీఆర్ఎస్ పార్టీ విడుదల చేసి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు ఈ పాటను విడుదల చేశారు.
ప్రగతి భవన్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాటను విడుదల చేయగా ఈ పాట ప్రస్తుతం ఎక్కడ చూసినా ట్రెండింగ్ గా నిలిచింది. నాగర్ కర్నూల్ జిల్లా, కల్వకుర్తి నియోజకవర్గం, తాండ్ర గ్రామానికి చెందిన కొమ్ము లక్ష్మమ్మ, బొల్లె సుశీల, శాంతమ్మ, కలమ్మ, అనసూయలు ఈ పాటను పాడి రెండు దఫాలుగా చేసిన బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశారు.
ఇక ఈ పాట అమెరికాలో కూడా దుమ్ము లేపుతుంది. అమెరికాలోని పబ్బుల్లో సైతం పెట్టుకొని యువత డాన్స్ చేస్తున్నారంటే ఈ పాటకు ఎంత క్రేజ్ ఉందో అర్థమవుతుంది. ఇక ఎంతో మంది సెలబ్రిటీలు కూడా ఈ పాటకు స్టెప్పులు వేస్తూ రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
2023 ఎన్నికలకు అన్ని పార్టీలు తయారు చేసిన పాటలలో బి ఆర్ ఎస్ పార్టీ తయారు చేయించిన గులాబీల జెండలే రామక్క పాట హైలెట్ గా నిలిచింది. ఏది ఏమైనా ఈ ఒక్క పాటతో కెసిఆర్ అందరి నోటితో కారును గుర్తుంచుకోవాలని పాడిస్తున్నారు. గురుతును గుర్తుంచుకోవాలని అందరితో చెప్పిస్తున్నారు.












Click it and Unblock the Notifications