మోడీ ఆనాడు గుజరాత్లో మన్మోహన్ ఫోటో పెట్టారా? నిర్మలా సీతారామన్ కు హరీష్‌రావు సూటిప్రశ్న!!
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ తెలంగాణ రాష్ట్ర పర్యటన బీజేపీ టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. నిర్మల సీతారామన్ తెలంగాణ సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేసి రాష్ట్రాన్ని దివాలా తీయించారని చేసిన వ్యాఖ్యలు, ఇక ఇదే సమయంలో రేషన్ షాపుల్లో ప్రధాని నరేంద్ర మోడీ ఫోటోలు పెట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన తీరు పై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు మరోమారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిధులిస్తే ఫోటోలు పెట్టాలా? మంత్రి హరీష్ రావు ఫైర్
కేంద్రం నిధులు ఇచ్చినంత మాత్రాన మోదీ ఫోటో పెట్టాల్సిందేనని చెప్పడంలో ఔచిత్యం లేదని హరీష్ రావు మండిపడ్డారు. కేంద్రమంత్రి వ్యాఖ్యలు అర్ధరహితం గా, అసంబద్ధంగా ఉన్నాయంటూ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. దేశానికి మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో, నాడు మోడీ గుజరాత్ రాష్ట్రంలో రేషన్ షాపుల్లో మన్మోహన్ సింగ్ ఫోటోలు పెట్టారా అంటూ హరీష్ రావు ప్రశ్నించారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలపై ఇలాంటి ఒత్తిడి తీసుకురావడం సబబుగా లేదని పేర్కొన్నారు మంత్రి హరీష్ రావు.

నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలను ఖండిస్తూ తొమ్మిది పేజీల లేఖ
నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలను ఖండిస్తూ తొమ్మిది పేజీల లేఖ రాశారు. కేంద్రం సమాఖ్య విలువలను కాలరాస్తున్నదని, రాష్ట్రానికి వచ్చి మూడు ఆరోపణలు, ఆరు అబద్ధాలాడి రాజకీయం చేస్తానంటే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోరని మంత్రి హరీష్ రావు హెచ్చరించారు. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందని తెలిసి కూడా నిర్మలా సీతారామన్ అబద్ధాలు మాట్లాడారని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం భారీ అప్పుల భారంతో కొట్టుమిట్టాడుతుందని, వారి రుణాలు పరిమితికి మించి ఉన్నాయని చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌పై ఆర్థిక మంత్రి టి. హరీష్ రావు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

రాష్ట్రాల రుణాలను నియంత్రించే హక్కు కేంద్రానికి ఉందన్న వ్యాఖ్యలపై మంత్రి సీరియస్
కేంద్రం కంటే తెలంగాణ ప్రభుత్వ రుణ స్థితి చాలా మెరుగ్గా ఉందని అన్నారు. రాష్ట్రాల రుణాలను నియంత్రించే రాజ్యాంగపరమైన అధికారాలు కేంద్ర ప్రభుత్వానికి ఉన్నాయని నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలను మంత్రి హరీష్ రావు నిలదీశారు. ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితికి మించి కేంద్రం రుణాలను ఎలా సమీకరించగలదని ప్రశ్నించిన ఆయన, పరిమితి విషయంలో రాష్ట్రాలను ఎలా పరిమితం చేస్తుందని నిర్మల సీతారామన్ నిలదీశారు

విభజన హామీలు నెరవేర్చకుండా రాజకీయాలా?
'వివక్షాపూరిత' నరేంద్ర మోదీ ప్రభుత్వం పన్నుల పంపిణీని తగ్గించి, దుర్మార్గపు ఉద్దేశాలతో సెస్ రూపంలో పన్నులు వసూలు చేయడం ద్వారా రాష్ట్రాలను ఆర్థికంగా నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. విభజన హామీల అమలు చేయకుండా తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష పూరితంగా వ్యవహరించడం ప్రజలందరూ గమనిస్తున్నారని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications