"రేవంత్ గురుదక్షిణ చెల్లించుకుంటున్నాడు!" - బనకచర్లపై హరీశ్ షాకింగ్ కామెంట్స్
Harish Rao: గోదావరిపై బనకచర్ల కట్టి తీరుతామని ఏపీ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మాజీ మంత్రి హరీష్ తీవ్రంగా స్పందించారు. లోకేష్ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ ఎందుకు స్పందించడం లేదని హరీశ్ సూటిగా ప్రశ్నించారు. లోకేష్ కేంద్రం , రేవంత్ బలం చూసుకుని మాట్లాడుతున్నారు.. ఆయన అలా మాట్లాడినా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదన్నారు. సీఎం, మంత్రులు ఎవరూ కూడా ఖండించలేదని.. ఎందుకు రాష్ట్ర సర్కారు నోరు మూసుకొని ఉందని ప్రశ్నించారు.
మేము కడితే ఎవరు ఆపుతారో చూస్తామని లోకేష్ అంటుంటే .. బనకచర్ల కట్టట్లేదని రేవంత్ రెడ్డి అంటున్నారంటూ హరీష్ రావు పేర్కొన్నారు. దీనిపై ఎవరూ స్పందించడం లేదంటే.. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ లోపాయికారి ఒప్పందం చేసుకున్నట్లు అర్థమవుతోందని ఆయన అన్నారు. సీఎస్ బనకచర్ల అంశం మీటింగ్ ఎజెండాలో ఉంటే సమావేశానికి రాలేమని లేఖ రాస్తే.. మీరేమో ఢిల్లీకి పోయి మొదటి అంశం గోదావరి బనకచర్ల ఉంటే కూడా ఆ సమావేశంలో పాల్గొంటారా అంటూ విమర్శించారు. కమిటీ వేయడానికి కూడా ఒప్పుకున్నారంటూ హరీశ్ మండిపడ్డారు. మీ అండ చూసుకునే బనకచర్లపై లోకేష్ బరి తెగింపు మాటలు మాట్లాడుతున్నారని.. సాగునీటి ప్రాజెక్టులపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం, కేంద్రం, రేవంత్ రెడ్డి మా చేతుల్లో ఉన్నారు కదా అని లోకేష్ ఏది పడితే అది మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు బుల్డోజింగ్ విధానాలకు కాంగ్రెస్, బీజేపీ వంత పాడుతున్నాయని హరీశ్ మండపడ్డారు.

రేవంత్ బనకచర్ల కడితే అడ్డుకుంటామని అంటుంటే.. లోకేష్ కట్టి తీరుతామని అనుమతులు తెస్తామని మాట్లాడుతున్నారని హరీష్ పేర్కొన్నారు. దీనికి రేవంత్ అడ్డుపడటం లేదని హరీష్ అన్నారు. ఈ మాటలను చూస్తుంటే రేవంత్ ఇప్పటికే గురుదక్షిణ చెల్లించుకునే పనిలో ఉన్నాడని అర్థమవుతోందంటూ హరీశ్ ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు లేవని లోకేష్ అంటున్నారని.. ఈ క్రమంలో అన్ని అనుమతులు కాళేశ్వరం ప్రాజెక్టుకు ఉన్నాయని హరీశ్ రావు స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును టీడీపీ అడ్డుకోలేదని లోకేశ్ అంటున్నాడని.. లోకేష్ మీకు తెలియకుంటే మీ నాన్నను అడగాలంటూ సూచించారు. కాళేశ్వరంను అడ్డుకున్నారా లేదా తెలుసుకోవాలన్నారు. కాళేశ్వరం అడ్డుకోవడానికి మీ నాన్న(చంద్రబాబు) కేంద్రానికి ఏడు ఉత్తరాలు రాశారని మాజీ మంత్రి హరీశ్ రావు చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications