ఉమాభారతితో హరీశ్‌రావు భేటీ: ప్రాణహితపై చర్చ
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలోని కరవు ప్రాంతాలకు జీవనాధారమైన ప్రాణహిత-చేవెళ్ల నీటిపారుదల ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి వెంటనే నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ హరీశ్‌రావు కేంద్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉమాభారతికి విజప్తి చేశారు. హరీష్‌రావు శుక్రవారం ఉమాభారతి అధ్యక్షతన జరిగిన రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రుల సమావేశానికి హాజరయ్యారు.
దేశంలోని వివిధ నదుల సంధానం గురించి ఈ ఆంతరంగిక సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానంతరం హరీశ్ రావు.. ఉమాభారతిని ప్రత్యేకంగా కలిసి తెలంగాణాకు సంబంధించిన వివిధ నీటిపారుదల ప్రాజెక్టుల గురించి వినతిపత్రాలు అందజేసి చర్చించారు. నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం వీలున్నంత త్వరగా పూర్తి చేయకపోతే తెలంగాణాలో కరువు పరిస్థితి మరింత తీవ్రం అవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టును పూర్తి చేస్తే తెలంగాణాలోని పది నుండి ఎనిమిది జిల్లాలకు నీటిపారుదల సౌకర్యం కలగటంతోపాటు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు తాగునీరు లభిస్తుందని హరీశ్ రావు కేంద్రమంత్రి ఉమాభారతికి వివరించారు.
గోదావరి ట్రిబ్యునల్ కేటాయించిన 160 టిఎంసిలను ఈ ప్రాజెక్టు కింద ఉపయోగించుకునేందుకు వీలున్నదన్నారు. చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకానికి ఏఐబిపి కింద 2013-14 సంవత్సరానికి ఇవ్వవలసిన 216 కోట్లను వెంటనే విడుదల చేయాలని ఆయన ఉమాభారతికి విజప్తి చేశారు.
ఈ పథకం కింద 2.49 లక్షల ఎకరాలకు సాగునీరు పంపిణీ చేయటంతోపాటు వరంగల్, కరీంనగర్, నల్గొండ జిల్లాల ప్రజలకు తాగునీరు సరఫరా చేసేందుకు వీలున్నదని తెలిపారు. ఏకీకృత భూగర్భ జల వనరుల నిర్వహణా ప్రాజెక్టులో రాష్ట్ర వాటాను ముప్పై నుండి పది శాతానికి తగ్గించాలని హరీశ్ రావు కోరారు.












Click it and Unblock the Notifications